వసతి గృహాన్ని పరిశీలించిన సబ్‌కలెక్టర్
కాటారం: కాటారం మండలకేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని అస్వస్థతకు గురికాగా.. మంగళవారం కాటారం సబ్ కలెక్టర్ వసతి గృహాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీతతో కలిసి సబ్ కలెక్టర్ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థిని అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను వార్డెన్ భవానిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. విద్యార్థినులు భయాందోళనకు గురయ్యేలా ప్రవర్తించిన నైట్ వాచ్‌మెన్‌ను వెంటనే తొలగించాలని సబ్ కలెక్టర్ డీఎస్‌డీఓను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ మాట్లాడుతూ విద్యార్థినులకు అనారోగ్య సమస్యలు లేవన్నారు. వాచ్‌మెన్ రాత్రి సమయంలో పూనకంతో ఊగిపోవడంతో విద్యార్థిని భయాందోళనకు గురైందన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వార్డెన్ విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులతో మాట్లాడినట్లు తెలిపారు. వాచ్‌మెన్‌పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డీఎస్‌డీఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment