ఎకో పార్కులో సౌకర్యాలు కల్పిస్తాం..
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కులో కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్కును బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మ, అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే, కలెక్టర్, అటవీ అధికారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కు స్థలం జిల్లాకు తలమానికమన్నారు. పార్కును అభివృద్ధి చేసి ప్రజలు వాకింగ్ చేసేందుకు అందుబాటులోకి తెస్తామని, అటవీ అధికారులు ఎలాంటి నియమ, నిబంధనలు విధించవద్దన్నారు. 171 సర్వే నంబర్‌లో 774 ఎకరాల భూమి ఉందని, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా ప్రజల కోసం ఉపయోగకరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఎకో పార్కు వినియోగంలోకి రావడం సంతోషకరమన్నారు. ప్రజలు ప్రశాంతమైన పచ్చటి చెట్లు కలిగిన ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం అటవీశాఖ నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 7వ తేదీన జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో కావాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పరిశీలించారు. ప్రజాపాలన విజయోత్సవ సంబురాల్లో భాగంగా పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నిర్వహించనున్న సభకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
యువ వికాసం సభకు..
జిల్లాలో గ్రూప్–4 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగ అభ్యర్థులను బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జరిగిన యువ వికాస సభకు జిల్లా నుంచి తరలివెళ్లారు. కలెక్టరేట్‌లో అధికారులు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నుంచి 101 మంది అభ్యర్థులు తరలివెళ్లి నియామక ప్రతాలు అందుకున్నారు.
కలెక్టర్‌తో కలిసి పార్కును
ప్రారంభించిన ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment