రోడ్డంతా కల్లాలే..
కాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా వరికోతలు దాదాపు పూర్తికావొచ్చాయి. రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. వెరసి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నారు. రోడ్లన్నింటినీ సగం వరకు వడ్లతో ఆక్రమించి కల్లాలుగా మార్చుతున్నారు. అధికారులు మాత్రం అటువైపు చూడడం లేదు. ప్రమాదాలు జరగకముందే వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
కొనుగోళ్ల ఆలస్యంతో..
జిల్లాలో 1,10,593 ఎకరాల్లో వరిసాగు చేశారు. 1.50లక్షల మెట్రిక్‌టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో 189 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రోడ్లపైనే ఎక్కువగా రైతులు వడ్లను కుప్పలుగా పోసి నిల్వ చేస్తున్నారు.
2019లో శ్రీకారం..
2019–20లో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా జాబ్‌కార్డు ఉన్నవారికి పొలాల్లో కల్లాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. కానీ రైతులు మాత్రం నిర్మాణాలకు మొగ్గు చూపలేదని లెక్కలు చెబుతున్నాయి. పండిన పంటను నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెట్టుకోవచ్చు. నిర్మాణాలపై రైతులు ఆసక్తి చూపలేదు.
చూసీచూడనట్లుగా..
ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతులకు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ మారడం లేదు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు పోలీసులు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ తదితర మండలాల్లో ధాన్యం నిల్వలు రోడ్లపై దర్శనమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టేకుమట్ల మండలం నైన్‌పాక బ్రిడ్జి సమీపంలో వడ్లు ఆరబోయగా కల్యాణ్ అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి పడి కాలు విరిగింది.
పూర్తికావొచ్చిన వరికోతలు
వడ్లతో నిండిపోతున్న రహదారులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు
రోడ్ల ఆక్రమణ..
రైతులు కల్లాలు నిర్మాణాలు చేయకపోవడంతో రోడ్లన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. సింగిల్‌రోడ్డులో కూడా కల్లాల మాదిరిగా వడ్లను ఆరబెడుతున్నారు. నిత్యం ఖరీఫ్, యాసంగి సీజన్‌లలో ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతూ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా రద్దీగా ఉండే రోడ్లపై కూడా ధాన్యం నిల్వలు ఉంచడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద ప్రమాదాలు జరుగక ముందే అధికారులు నిల్వలను త్వరగా ఖాళీ చేయించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.
చర్యలు తప్పవు
రోడ్లపై వరిధాన్యం నిల్వ చేసి ఆరబెడితే చర్యలు తప్పవు. రోడ్డుపై కాకుండా పొలాల్లోనే కల్లాలు ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట రోడ్డుపై ధాన్యం కనిపించకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రోడ్లపై వరిధాన్యం నిల్వ ఉంచవద్దని రైతులకు ఇప్పటికే కౌన్సెలింగ్ చేశాం. మళ్లీ ఆయా గ్రామాల్లో తెలియజేస్తాం.
– గడ్డం రామ్మోహన్‌రెడ్డి, డీఎస్పీ, కాటారం
Comments
Please login to add a commentAdd a comment