జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
కాటారం: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల హ్యాండ్‌బాల్ అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. నవంబర్ 8నుంచి 10వరకు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 విభాగంలో ఉమ్మడి వరంగల్ జట్టు తరఫున గురుకులం హ్యాండ్‌బాల్ అకాడమీ విద్యార్థులు చందర్, నరేశ్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వరంగల్ జట్టు తరఫున గోల్డ్‌మెడల్ సైతం సాధించారు. దీంతో చందర్, నరేస్‌ను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి రమేశ్ తెలిపారు. ఈ నెల 11నుంచి 17వరకు పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ప్రిన్సిపాల్ బి.లాలు, వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందించారు.
రుణపడి ఉంటా..
భూపాలపల్లి రూరల్: యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించిన ప్రతీ ఒక్కరికి రుణ పడి ఉంటానని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్‌లో టపాసులు కాల్చారు. శాలువాతో కరుణాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, సంతోష్, రాజు, నాగరాజు, అనూప్, మహిళా నాయకులు ప్రేమ, మాలతి పాల్గొన్నారు.
పాలనను గాలికొదిలేసిన
ప్రభుత్వం
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి అన్నారు. బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం భూపాలపల్లి మండలం కొంపెల్లి, గొర్లవీడు, కాసీంపల్లి, జంగేడు, భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నిశిధర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని ఎమ్మెల్యే కేవలం శిలాఫలకాల వరకే పరిమితం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా నిరసనగా బైక్ ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు. డబుల్ బెడ్‌రూంల వద్ద ధర్నా చేస్తున్న లబ్ధిదారులకు మద్దతుగా నిశిధర్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. అర్హులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగపురి రాజమౌళి గౌడ్, కన్నం యుగంధర్, రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకుడు బట్టు రవి, నాయకులు మందల రఘునాథ్‌రెడ్డి, జన్నె మొగిలి, దొంగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి సీఎం కప్
క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 7వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 7, 8తేదీల్లో గ్రామ స్థాయి, 10నుంచి 12వ తేదీ వరకు మండలస్థాయిలో, 16నుంచి 21వ తేదీ వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. క్రీడా పోటీల్లో పాల్గొనే వారు cmcup2024.telangana. gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్‌కార్డులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment