ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కే ఉంది.. | Sakshi
Sakshi News home page

ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కే ఉంది..

Published Thu, Apr 18 2024 10:25 AM

ధరూరులో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు    - Sakshi

60 ఏళ్ల కల సాకారం చేసిన ఘనత పార్టీదే : మంత్రి జూపల్లి

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీ అభ్యర్థి మల్లు రవి

ధరూరులో ఆందోళన..

దిలాఉండగా, కాంగ్రెస్‌ నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిపై మల్దకల్‌లో దాడి జరగగా.. ఇతర మండలాలకు చెందిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ సభ నిర్వహించనివ్వమని.. ప్రచార వాహనంలో పాటలు ఆపాలని అడ్డు చెప్పారు. ఈక్రమంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పారు. దీంతో నాయకులు ప్రచార వాహనంపై నుంచి మాట్లాడి వెళ్లిపోయారు.

గద్వాల రూరల్‌/గట్టు/మల్దకల్‌/ధరూరు: మిగులు రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చడంతోపాటు పేదల సంక్షేమాన్ని గాలికొదిలిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన నాయకురాలు సోనియాగాంధీ అని, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం గట్టు, మల్దకల్‌, ధరూరు, గద్వాలలో మల్లురవితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రూ.లక్ష రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, కేజీటూపీజీ ఉచిత విద్య ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిందని, రాముడు అందరి దేవుడని అలాంటి శ్రీరామచంద్రుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రస్తుత ఎంపీ రాములు బీఆర్‌ఎస్‌ పార్టీలో గెలిచి ఇప్పుడు తన కుమారుడిని బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో పెట్టారని వారికి ఓటుహక్కు అడిగే హక్కులేదన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్‌ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి.. ఇప్పుడు అదే పార్టీలో చేరి తన నైతికతను పోగొట్టుకున్నారని, ఆయన ఓటు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయని, అలాంటి పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉన్నారని మరోసారి అండగా నిలబడి రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కోరారు. ఇక్కడ మల్లురవిని ఎంపీగా గెలిపించాలని కోరారు.

● ప్రాజెక్టులు నిర్మించి, బీడు భూములకు సాగునీటిని అందించింది కాంగ్రెస్‌ పార్టీ అని, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి అన్నారు. చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, సంపత్‌కుమార్‌, బీఎస్‌ కేశవ్‌, మధుసూదన్‌బాబు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement