వేరుశనగ క్వింటాల్ రూ. 6,339
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 3,682 క్వింటాళ్ల వేరుశగన అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 6,339, కనిష్టంగా రూ. 3326, సరాసరి రూ. 5వేల ధరలు పలికాయి. 234 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 5,829, కనిష్టంగా రూ. 4,416, సరాసరి రూ. 5,819 ధరలు లభించాయి. 655 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,302, కనిష్టంగా రూ. 1,851, సరాసరి రూ. 2,011 ధరలు వచ్చాయి.
11న సీఎం
రేవంత్‌రెడ్డి రాక
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మో త్సవాలు, జాతరను పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం వస్తారని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద అధికారులతో కలిసి హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రాకకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సీఐ రామకృష్ణ, దేవస్థానం సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇంటింటికీ
యోగా విస్తరించాలి
గద్వాలటౌన్: ఇంటింటికీ యోగా విస్తరించాలని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి బీఎస్ ఆనంద్ అన్నారు. పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వీకులు అందించిన గొప్ప కానుక యోగా అని అన్నారు. నిత్యం సాధన చేయడంతో పూర్తి ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని చెప్పారు. 15 రోజలపాటు యోగా శిబిరం కొనసాగుతుందన్నారు. అనంతరం యోగా శిక్షకుడు దేవదాస్ నాయుడు యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో ప్రభాకర్, వెంకటనారాయణ, కృష్ణయ్య పాల్గొన్నారు.
యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
అలంపూర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఉపాధి అవకాశాల ఏర్పాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో ఎంతో ప్రావీణ్యం ఉన్నప్పటికీ.. సరైన ప్రోత్సాహం లేక యువత వెనుకబడుతున్నారని అన్నారు. వారు స్వయం ఉపాధి పొందేందుకు గాను చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎంఎస్‌ఎంఈ కోఆర్డినేటర్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి షేక్షావలీచారి, వెంకటేష్, గోపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తత అవసరం
గట్టు: పశువులకు సీజనల్‌గా వచ్చే వ్యాధులపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో భవిష్య భారత్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ సంస్థ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువులు గాలికుంటు వ్యాధికి గురైతే, మేత మేయకుండా బలహీనంగా మారుతాయన్నారు. వాటికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శంకరయ్య, వరలక్ష్మి, ప్రియాంక, కనకరాజు, పృథ్వీరావు, అబ్దుల్ ఖాజా, పేదరిక నిర్మూలన అధికారి వెంకటేశ్వర్లు, హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment