భారత్‌మాల రహదారి పనులు వేగవంతం
గట్టు: భారత్‌మాల జాతీయ రహదారి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని తప్పెట్లమొర్సు, ఆరగిద్ద గ్రామాల శివారుల్లో కొనసాగుతున్న భారత్‌మాల ఆరు వరుసల జాతీయ రహదారి పనులను మంగళవారం నేషనల్ హైవే అథారిటీ అధికారులు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి పనుల పురోగతిని తెలుసుకున్నారు. భారత్‌మాల జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, స్థానిక రైతులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్లతో పాటు రైతుల వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించాలని కోరారు. ఆరగిద్ద నుంచి మాచర్లకు వెళ్లే దారిలో జాతీయ రహదారి అటు వైపు రైతుల భూములు ఉన్నాయని.. అక్కడ అండర్‌గ్రౌండ్ బిడ్జి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే రోడ్డు నిర్మాణంలో బిడ్జి ప్రస్తావన లేదని.. అవసరమైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని పరిశీలిస్తామని హైవే అథారిటీ అధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరితారాణి, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
సర్వీస్ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment