బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
గద్వాల రూరల్/మల్దకల్: బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి గంట కవితాదేవి అన్నారు. మంగళవారం గద్వాల మండలంలోని గుంటిపల్లి, రేకులపల్లి గ్రామాల్లో పత్తి, మిరప పొలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు పని చేస్తున్నట్లు గుర్తించి, వారి వివరాలను సేకరించారు. అనంతరం గుంటిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అదేవిధంగా మల్దకల్ మండలంలోని అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలకార్మిక వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలబాలికలను పనుల్లో పెట్టుకోవడం చట్ట విరుద్ధమన్నారు. ప్రతి చిన్నారికీ విద్య ఎంతో అవసరమన్నారు. బడిఈడు బాలబాలికలను పాఠశాలకు పంపించి, వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని తల్లిదండ్రులకు సూచించారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులు డ్రగ్స్, సామాజిక మాద్యమాలకు ప్రభావితం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో కార్మికశాఖ సీనియర్ అసిస్టెంట్ అబ్రహం, హెచ్‌ఎం నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment