పుస్తకాల ద్వారానే జ్ఞాన సముపార్జన
గద్వాలటౌన్: పుస్తకాల ద్వారానే జ్ఞాన సముపార్జన లభిస్తుందని, ప్రతి విద్యార్థి తన జీవితంలో పుస్తక పఠనం అటవాటుగా మార్చుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. గత వారం రోజులుగా కొనసాగిన జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మనిషి జీవితంలో విలువలు ఒకరు నేర్పేది కాదని మనకు మనమే నేర్చుకోవాలని, అలాంటి విలువలు కేవలం పుస్తకాల్లోనే లభిస్తాయని అన్నారు. దొరికిన ప్రతి పుస్తకం చదవాలని, ఆ తర్వాత ఏది మంచిదో నిర్ధారించుకోవాలన్నారు. వికాసంతో పాటు విజ్ఞానం, ఉన్నత లక్ష్యసాధన గ్రంథాలయాలతోనే సాధ్యమని, అందుకే వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కథ, నవలలో సంతోషం, కష్టసుఖాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు కూడా పోటీలలో పాల్గొనడమే ముఖ్యమని, గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, రంగవల్లులు తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులతోపాటు షిల్డ్‌లను అందజేశారు. చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీపీఓ శ్యామ్ సుందర్, కార్యదర్శి శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ అధికారి రామంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment