గద్వాలటౌన్ : ప్రాక్టికల్స్ పరీక్షల కోసం ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కళాశాలలకు రూ.2లక్షలు నిధులు మంజూరయ్యాయి. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గత కొన్నేళ్లుగా ఇంటర్ కళాశాలలకు ప్రాక్టికల్స్ కోసం నిధులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు సుమారు వెయ్యి మంది వరకు ఉన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ఏడాదికి 20+20 చొప్పున, జువాలజీ, బోటనీలకు ఏడాదికి 12+12 తరగతుల చొప్పున విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో కళాశాలకు రూ. 25 వేల చొప్పున జిల్లాలోని 8 కళాశాలలకు గాను రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులతో అవసరమైన పరికరాలు, రసాయనాలు కొలుగోలు చేస్తామని డీఐఈఓ హృదయరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment