ఆగుతూ.. సాగుతూ..! | - | Sakshi
Sakshi News home page

ఆగుతూ.. సాగుతూ..!

Published Fri, Dec 20 2024 12:46 AM | Last Updated on Fri, Dec 20 2024 12:46 AM

ఆగుతూ

ఆగుతూ.. సాగుతూ..!

పత్తి కొనుగోళ్లకు తరచూ అంతరాయం

మూడు రోజులైంది వచ్చి..

నాకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. రెండు ఎకరాలకు కలిపి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. బయటి మార్కెట్‌లో ధర లేకపోవడంతో దూరమైన సీసీఐ కేంద్రానికి వచ్చాను. ఇక్కడికి రావడానికి ట్రాక్టర్‌ కిరాయి రూ.4 వేలు అయ్యింది. ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది. కానీ సెలవని కాంటా వేయడం లేదు. చేసేది లేక ఇక్కడే ఉంటున్నాను.

– సత్యారెడ్డి, పత్తి రైతు,

మల్లెందొడ్డి, మల్దకల్‌ మండలం

సామర్థ్యం తక్కువగా

ఉండటంతోనే..

సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది. ఎక్కువ పత్తి నిల్వ చేస్తే వేడి పెరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇటీవలే చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగింది. అందుకే అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నాం. రైతుల నుంచి చివరి వరకు పత్తి కొనుగోలు చేస్తాం.

– ఎల్లస్వామి,

మార్కెట్‌ యార్డు కార్యదర్శి, అలంపూర్‌

అలంపూర్‌: పత్తి పంట సాగు ఒక ఎత్తు అయితే.. దానిని విక్రయించడం మరో ఎత్తులా మారింది. సీసీఐ కేంద్రం వద్ద పత్తి విక్రయించాలంటే ముందుగా టోకెన్‌ తీసుకోవాలి.. దానికి బారెడు క్యూలో గంటలపాటు వేచి ఉండాలి. తీరా టోకెన్‌ దక్కితే కేటాయించిన తేదీ రోజు వాహనంలో పత్తి లోడ్‌ చేసుకొని కేంద్రం వద్దకు రావాలి. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. జిల్లాలో ఒకే ఒక్క పత్తి కొనుగోలు కేంద్రం (సీసీఐ) ఉండగా.. అది కూడా తరచూ కొనుగోళ్లు నిలిపివేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం ప్రారంభించి 45 రోజులు అయితే.. ప్రభుత్వ సెలవులు, నిల్వలు పేరుకుపోయాయి తదితర కారణాలు చెబుతూ కేవలం 29 రోజులు మాత్రం కొనుగోళ్లు జరిపారు. దీంతో సీసీఐ కేంద్రం వద్ద నిత్యం వాహనాలు బారులు తీరగా.. తమ టోకెన్‌ నెంబర్‌ ఎప్పుడు వస్తుందో అంటూ రైతులు అక్కడే వంటలు చేసుకుంటూ చలికి ఇబ్బందులు పడే దుస్థితి నెలకొంది.

జిల్లాలో ఒకే సీసీఐ కేంద్రం

జిల్లాలో ఈ ఏడాది ఒకే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉండవెల్లి మండలం అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని శ్రీవరసిద్ధి వినాయ కాటన్‌ మిల్లులో కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినా.. ఒక్క అలంపూర్‌ నియోజకవర్గంలోనే ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. దీంతో జిల్లాలోని గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన రైతులు ఇక్కడికే రావాల్సి వస్తోంది. దీంతో పండించిన పత్తిని అమ్ముకోవడానికి అటు దూరభారం.. ఇటు వాహనాల అద్దె ఖర్చు లు.. ఎదురుచూపులతో ఇబ్బందులు తప్పడంలేదు.

45,296 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో 1,360 మంది రైతుల నుంచి 45296.50 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఈ పత్తి విలువ సుమారు రూ.33.17 కోట్లు. సీసీఐ కేంద్రంలో పత్తికి తేమ 8 నుంచి 12 శాతం, నాణ్యతతో ఉన్న పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు తక్కువగా రూ.7121 నుంచి రూ. 7521 అందించారు. ప్రస్తుతం క్వింటాకు మద్దతు ధర రూ.7121 నుంచి రూ.7421 చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.6500 నుంచి రూ. 6800 వరకు పలుకుతుంది. సీసీఐ కేంద్రంలో క్వింటాకు రూ.600 నుంచి 800 వరకు అదనంగా ఉండటంలో రైతులు సీసీఐ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు.

మూడు రోజులు నిలిపివేత

సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి రైతుల పడిగాపులు..

జిల్లాలో ఒకే పత్తి కొనుగోలు కేంద్రం.. పేరుకుపోతున్న నిల్వలు

ఇప్పటి వరకు 45,296 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

నిరంతరాయంగా కొనుగోళ్లు జరపాలని రైతుల వేడుకోలు

ఉండవెల్లి మండలం అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని శ్రీవరసిద్ధి వినాయ కాటన్‌ మిల్లులో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేశారు. తాజాగా పత్తి కొనుగోళ్లు ఈ నెల 20, 21, 22 మూడు రోజులపాటు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యదర్శి ఎల్లస్వామి తెలిపారు. కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వలు పేరుకుపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. తిరిగి ఈ నెల 23వ తేదీన కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, నవంబర్‌ 4వ తేదీన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రం ఏర్పాటు చేసిన పత్తి మిల్లులో నిల్వల సామర్ధ్యం తక్కువగా ఉండటంతో 45 రోజుల్లో కేవలం 29 రోజులు కొనుగోళ్లు జరగగా మిగిలిన 16 రోజులు సెలవులే ఉన్నాయి. కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగకపోవడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. టోకెన్లు పొందడానికి కొన్ని రోజులు, టోకెన్లు పొందిన తర్వాత అమ్మడానికి కొన్ని రోజులు పడిగాపులు తప్పడం లేదు. కేంద్రంలో రోజుకు 1500 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంత కంటే ఎక్కువ పత్తి కేంద్రానికి వస్తోంది. చేసేదిలేక అధికారులు శని, ఆదివారాలతోపాటు అదనంగా సెలవులు ప్రకటించి తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆగుతూ.. సాగుతూ..! 1
1/3

ఆగుతూ.. సాగుతూ..!

ఆగుతూ.. సాగుతూ..! 2
2/3

ఆగుతూ.. సాగుతూ..!

ఆగుతూ.. సాగుతూ..! 3
3/3

ఆగుతూ.. సాగుతూ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement