నల్లమలలో కారిడార్
●
సురక్షిత ప్రయాణానికి
హైదరాబాద్– శ్రీశైలం వరకు ఫోర్‌లైన్ల రహదారి
● మన్ననూర్– పాతాళగంగ మార్గంలో 62 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్
● ప్రాజెక్టు వ్యయం అంచనా రూ.7,700 కోట్లు
● శ్రీశైలం డ్యాం వద్ద నాలుగు వరుసల భారీ వంతెన
● మల్లన్న సన్నిధికి తగ్గనున్నప్రయాణ భారం
డ్యాం వద్ద ఐకానిక్ బ్రిడ్జి
హైదరాబాద్– శ్రీశైలం– తోకపల్లి జాతీయ రహదారిలో శ్రీశైలం డ్యాం వద్ద ఐకానిక్ వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ మార్గంలో పాతాళగంగ వద్ద ఇరుకై న బ్రిడ్జి ఉంది. ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు తెలంగాణలోని ఈగలపెంట, ఆంధ్రప్రదేశ్‌లోని సున్నిపెంట గ్రామా ల మధ్య కృష్ణానదిపై 173 మీటర్ల ఎత్తు, 670 మీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ వైపు 180, ఏపీ వైపు 340 మీటర్ల సపోర్ట్ బ్రిడ్జి డిజైన్ రూపొందించారు. దీంతో శ్రీశైలానికి మరో 9 కి.మీ., దూరం తగ్గుతుంది.
ప్రతిపాదనలు పూర్తయ్యాయి..
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి. ఒకవైపు వన్యప్రాణులను సంరక్షిస్తూనే.. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు ఈ కారిడార్ మేలు చేయనుంది. దక్షిణకాశీగా పిలిచే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరిగితే నిత్యం రద్దీగా ఉండే శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
సానుకూలంగా స్పందన..
హైదరాబాద్– శ్రీశైలం రోడ్డు విస్తరణకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని భూత్పూర్– మన్ననూర్– మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ)– సిరిగిడిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు ఒక రహదారి, పుల్లూరు– అలంపూర్ మీదుగా కొల్లాపూర్– అచ్చంపేట– దేవరకొండ– నల్లగొండ వరకు మరో జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: ఒకవైపు అరుదైన వన్యప్రాణులు, వృక్షజాతులను సంరక్షిస్తూనే.. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు నల్లమల వేదిక కానుంది. నల్లమల అటవీ ప్రాంతం గుండా సుమారు 62 కి.మీ., మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల జీవనానికి ఆటంకం కలిగించకుండా భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రూ.7,700 కోట్ల నిధులతో ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన డీపీఆర్ రూపొందించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
30 అడుగుల ఎత్తులో..
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 గుండా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ మార్గంలో సుమారు 62.5 కి.మీ., మేర నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మన్ననూరు గ్రామం నుంచి పాతాళగంగ వరకు సుమారు 30 అడుగుల ఎత్తులో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో వన్యప్రాణుల భయం లేకుండా ఎత్తు నుంచే గమ్యాన్ని చేరుకునేందుకు వీలుంది. హైదరాబాద్– ఏపీలోని ప్రకాశం మధ్య 45 కి.మీ., మేరకు దూరభారం తగ్గనుంది.
డీపీఆర్ పూర్తయితే భూసేకరణ
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ కోసం 2022– 23లో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని 128.6 కి.మీ., నుంచి 191 కి.మీ., వరకు రోడ్డు విస్తరణకు ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. జనావాసాలు ఉన్న మన్ననూర్, దోమలపెంటల వద్ద బైపాస్, మూలమలుపులు ఉన్నచోట నేరుగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు ఉన్నాయి. డీపీఆర్ పూర్తయితే అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి– మన్ననూర్ నుంచి ఈగలపెంట– పాతాళగంగ వరకు సుమారు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇందులో 128.63 హెక్టార్లు అటవీ భూమి కాగా.. మరో 18.68 హెక్టార్ల అటవీయేతర భూమి సేకరించనున్నారు.
24 గంటల పాటు రాకపోకలు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం గుండా ఈ రహదారి వెళ్తుండటంతో ప్రస్తుతం మన్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీశాఖ అనుమతించడం లేదు. వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా వాహనాల వేగం సైతం గంటకు 30 నుంచి 40 కి.మీ.కే పరిమితమవుతోంది. ఈ రోడ్డుపై నిత్యం 8 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. శని, ఆదివారాల్లో రద్దీ 10 వేల వాహనాలకు మించుతోంది.
Comments
Please login to add a commentAdd a comment