జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ట్రాన్స్‌కో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ తిరుపతిరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
27, 28 తేదీల్లో
వైజ్ఞానిక ప్రదర్శన
గద్వాలటౌన్: విద్యార్థుల్లోని వినూత్న ఆలోచనలకు రూపం కల్పించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యాశాఖ ఓ వేదిక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు స్థానిక ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. గురువారం స్థానిక బాలభవన్‌లో డీఈఓ అబ్ధుల్ ఘనీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంఈఓ, హెచ్‌ఎం, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం, ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైజ్ఞానిక ప్రదర్శనపై దిశానిర్ధేశం చేశారు. విద్యార్థుల చేత మెరుగైన ప్రాజెక్టులను రూపొందించేలా వారిని సిద్దం చేయాలని డీఈఓ సూచించారు. ఈ సారి జిల్లా నుంచి ఒక్క ప్రదర్శన అయినా జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
29 మంది వార్డు
అధికారుల నియామకం
గద్వాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి కొత్త వార్డు అధికారులను, ఉద్యోగులను కేటాయించింది. గత నెలలో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 29 మంది అభ్యర్థులను గద్వాల మున్సిపాలిటీకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 25 మంది వార్డు అధికారులు, ఇద్దరూ జూనియర్ అకౌంటెంట్లు, ఇద్దరూ జూనియన్ అసిస్టెంట్లు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 13 మంది వార్డు అధికారులు, ఇద్దరూ అకౌంటెంట్లు రిపోర్టు చేశారు. మరో 14 మంది రిపోర్టు చేయాల్సి ఉంది. మున్సిపల్ కమిషనర్ దశరథ్ వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. వార్డు అధికారుల నియామకంతో మున్సిపాలిటీలో సేవలు మెరుగుపడనున్నాయి. పౌరసేవలు సత్వరం అందే అవకాశం ఉంది.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలి
గద్వాలటౌన్: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం క్రమబద్ధీకరించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గురువారం సైతం కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబట్టి దీక్ష చేపట్టారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేసి తమ జీవి తాలలో వెలుగులు నింపాలంటూ దీక్ష శిబిరంలోని ఉద్యోగులు క్రొవ్వొత్తులు వెలగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. 20 ఏళ్లుగా పనిచేస్తూ గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రతి ఉద్యోగికి జీవిత భీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులందరిని క్రమబద్దీకరించాలని, అప్పటి వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హుస్సేనప్ప, గోపాల్, ప్రణీత, శేషన్న, ఖాజా, సమి, శ్యామ్, శ్రీనివాసులు, రామంజనేయులు, ఎస్‌ఓలు ఆసియాబేగం, గోపిలత, శ్రీదేవి, పద్మ, చంద్రకళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment