ఆదిశిలా క్షేత్రం.. భక్తజన సంద్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల సమయంలో రాలేని భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి పెద్దసంఖ్యలో చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో దాసంగాలు పెట్టి స్వామి వారికి నైవేద్యాలు, తలనీలాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాన్ని చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన నాయకులు , అధికారులు వేర్వేరుగా ఆలయాన్ని చేరుకుని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు మధుసూధనాచారి, రవిచారి, దీరేంద్రదాసు, నాగరాజు శర్మ, చంద్రశేఖర్ రావు, వాల్మీకీ పూజారులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కట్టెకోలాటం
జాతర సందర్భంగా ఆదివారం స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పెద్దొడ్డి గ్రామానికి చెందిన మాస్టర్ రాము ఆధ్వర్యంలో నిర్వహించిన కట్టె కోలాటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 50మంది బాలబాలికలు రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ అనంతరం మల్దకల్ జాతరలో తమ ఆరాధ్య దైవమైన స్వామి వారి ఆలయ ఆవరణలో కోలాట ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారిని ఆర్యవైశ్య సంఘం నాయకులు బాదం శ్రీనివాసులు, మనసాని నాగరాజులు శాలువా, పూలమాలతో సత్కరించారు.
స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు
జాతరలో ఆకట్టుకున్న కట్టె కోలాటాలు
Comments
Please login to add a commentAdd a comment