వెలుగుల పండుగ వచ్చేస్తోంది
గద్వాలటౌన్ : క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ పండుగకు జిల్లా కేంద్రం ముస్తాబవుతోంది. క్రిస్మస్ అనగానే కళ్లముందు కదలాడే క్రిస్మస్ చెట్టు, రంగులలో వెలుగులు జిమ్మే నక్షత్రాలు, క్యాండిల్స్, చెట్టును అలంకరించే రకరకాల అలంకరణ వస్తువులు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్, కర్నూలు నుంచి వచ్చిన రంగుల చెట్లు, వెలుగులు ప్రసరించే తోరణాలు, దుకాణాల్లో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. వ్యాపారులు అందరిని ఆకర్షించేందుకు వివిధ రకాల ఆధునిక బొమ్మలను తెప్పించి స్థానికులను ముగ్ధుల్ని చేస్తున్నారు. యేసు ప్రభువు, మేరీమాత, క్రిస్మస్ తాత చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. గతంలో కంటే ఈ సారి వ్యాపారులు క్రిస్మస్ పండుగకు సంబంధించిన వివిధ రకాల సామగ్రి తెప్పించారు. పట్టణంలోని సుమారు 20 దుకాణాల్లో వీటిని అమ్ముతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్రాలను ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఆయా కాలనీలలో ఉన్న చర్చిలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తు క్రీస్తు రాకను స్వాగతిస్తున్నారు. పండుగ రోజు మరిన్ని ఏర్పాట్లుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. చర్చిలతో పాటు నివాస గృహలను సుందరంగా అలంకరిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకొనేందుకు ఆయా వర్గాల ప్రజలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకల సందడి నెలకొంది.
క్రిస్మస్ సందడి ప్రారంభం
చర్చిలలో ప్రత్యేక కార్యక్రమాలకు సన్నాహాలు
Comments
Please login to add a commentAdd a comment