ఆశాలకు రూ.18వేల వేతనం ఇవ్వాలి
గద్వాలటౌన్: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడం కోసం క్షేత్రస్థాయిలో విస్తృత సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని.. లేదంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి హెచ్చరించారు. సమస్యల పరిష్కరం కోరతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు జాత సోమవారం గద్వాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పాతబస్టాండు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో తమ పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. వీటితో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశా వర్కర్ల సంఘటిత పోరాటాల ఫలితంగానే రూ.200 నుంచి రూ.9500 వరకు వేతనాలు పెరిగాయన్నారు. వర్కర్లపై రోజురోజుకు పని భారం పెరుగుతుందని. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకుంటే దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకురాలు పద్మమ్మ, సునీత, సీఐటీయూ నాయకులు వీవీ నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, గట్టన్న, కాంతమ్మ, లక్ష్మి, మాధవి, చెన్నమ్మ, సరస్వతి, యశోద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment