ఆవిష్కరణలతో సమస్యలకు పరిష్కారం
గద్వాలటౌన్: నేటి తరం విద్యార్థులు విజ్ఞాన ఆవిష్కరణలపై ఆసక్తిని చాటుతూ పలు సమస్యల పరిష్కారాన్ని చూపించేలా వాటిని రూపొందించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక అనంత ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రదర్శనలను ఆవిష్కరించాలని సూచించారు. విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానానికి కొదవ లేదని, దీనిని ప్రజాపరం చేసే ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నప్పుడే పలు సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. గద్వాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని, ఆ దృష్టితో విద్యార్థులు పరిశోధనలు సాగించాలన్నారు. డీఈఓ అబ్ధుల్ ఘనీ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రాన్ని మానవాళి మనుగడకు ఉపయోగించాలని కోరారు. శాసీ్త్రయ విద్యా ప్రమాణాలు ఉన్న విద్యార్థులను మరో కోణంలో నిలబెడతాయని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు, వార్డు కౌన్సిలర్లు కృష్ణ, నరహరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శనలను తిలకించిన నాయకులు
రెండు రోజుల పాటు జరిగే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను గద్వాల ఎమ్మెల్యే, అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు వేర్వేరుగా తిలకించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 248 ప్రదర్శనలను విద్యార్థులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు ఆవిష్కరణలను తిలకిస్తూ విద్యార్థులను అడిగిప్రదర్శన ఉపయోగాలు, పనిచేయు విధానాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రయోగశాలలుగా మారితే సాంకేతిక రంగంలో విజయం సాధ్యమవుతుందన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment