‘ఉపాధి’కి ఊతం
గద్వాలన్యూటౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రజలకు అవసరమైన ప్రధాన పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందించారు. గత డిసెంబర్ నుంచి ప్రారంభమైన ఈ పనులను మార్చిలోగా పూర్తిచేయాలని నిర్ణయించారు. మండలాల వారీగా మొత్తం 2,68,260 పనిదినాలను కూలీలకు కల్పిస్తూ.. రూ.19.19 కోట్ల విలువైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
శాశ్వత ప్రాతిపదికన..
ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ముందుగానే గుర్తిస్తారు. అయితే శాశ్వత ప్రాతిపదికన ఉండే పనులతో పాటు నీటి సంరక్షణ పనులను చేపట్టేలా ప్రణాళికలను రూపొందిస్తారు. వీటిలో కొన్నింటిని పూర్తిస్థాయిలో ప్రాధాన్యతతో కూడిన పనులు త్వరగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకు నాలుగు నెలల గడువు విధించింది.ఈ మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలంలో లక్ష్యసాధనకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 20వేల పనిదినాల లక్ష్యం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవీ పనులు..
మహిళాశక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాకలు, వర్మి కంపోస్ట్, నాడెప్, ఫౌల్ట్రీ షెడ్లు, పొలాల చదును పనులు చేపడతారు. పొలం బాటల కింద పొలాలకు మట్టిరోడ్లు, వన మహోత్సవం ద్వారా నర్సరీల ఏర్పాటు, పండ్లతోటల నిర్వహణ, ఉద్యాన పంటలకు డ్రిప్ ఏర్పాటు చేస్తారు. జలనిధితో చెక్‌డ్యాంలు, వాలుకట్టలు, వాననీటి సంరక్షణ గుంతలు, బావుల పూడికతీత తదితర పనులు చేపడతారు. గ్రామీణ పారిశుద్ధి నిర్వహణ ద్వారా ఇంకుడు గుంతలు నిర్మిస్తారు.
జిల్లాలో జాబ్‌కార్డులు: 1,56,658
కూలీల సంఖ్య: 3,51,296
ప్రతి కూలీకి పని కల్పిస్తూ..
ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి పని కల్పిస్తూ.. నిర్దేశించిన పనిదినాలను పూర్తి చేయడంతో పాటు ప్రాధాన్యత పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా మండలాలు, గ్రామాల్లో డిమాండ్, అవసరాల మేరకు పనులను గుర్తిస్తున్నారు. ఉపాధి హామీ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పొలాల చదును, పొలం బాటలు, వాననీటి సంరక్షణ, బావుల పూడికతీత, పశువుల పాకలు, నర్సరీలు తదితర పనులు పలు గ్రామాల్లో కొనసాగుతున్నాయి.
మండలాల వారీగా ప్రాధాన్యత పనుల గుర్తింపు
నాలుగు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యం
కూలీలకు 2,68,260 పనిదినాలు
రూ. 19.19 కోట్లు కేటాయింపు
లక్ష్య సాధనకు చర్యలు..
ఉపాధి హమీ పథకం ద్వారా ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం. డిసెంబర్ నుంచి ప్రత్యేకంగా ప్రతి మండలానికి పనిదినాల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ.. శాశ్వత, ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నాం. మార్చి వరకు ఈ పనులు, పనిదినాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – నర్సింగ్‌రావు, ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment