మొక్కజొన్న సాగులో మెళకువలు పాటించాలి
ఎర్రవల్లి: మొక్కజొన్న సాగులో రైతులు సరైన మెళకువలు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మంజులత అన్నారు. మంగళవారం మండలంలోని పుటాన్‌దొడ్డి రైతువేదికలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆధ్వర్యంలో యాసంగిలో సాగుచేసే మొక్కజొన్న పంటపై రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొక్కజొన్న సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్త రైతులకు, వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించి మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండే విత్తన రకాలను మాత్రమే ఎంచుకోవాలన్నారు. విత్తనాల్లో మొలక శాతం 70 కంటే ఎక్కువగా ఉండాలన్నారు. ముఖ్యంగా విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే కొనాలన్నారు. లేదా రైతులు సొంతంగా ఇంటి దగ్గరే విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. రైతులు రోగ నిరోధక శక్తి కలిగి అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ రకాలు వాడాలన్నారు. బిందు, తుంపర్ల సేద్యంలో నీరు పెడితే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని, కాయలను సరైన పక్వత ఉన్నప్పుడు కోసి ఆకారం, పరిమాణం, రంగును అనుసరించి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తరలిస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment