ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
మల్దకల్/ అయిజ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతోపాటు సుఖ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప అన్నారు. మంగళవారం మల్దకల్ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఓపీ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది గర్భిణి, బాలింతల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నెలనెలా క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు చేయించాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య మరింత పెంచాలన్నారు. అలాగే వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే అయిజలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డీఎంహెచ్‌ఓ పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎంసీలను మూడు నెలలలోపే గుర్తించి నమోదు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్వరూపరాణి, కిరణ్, ప్రోగ్రాం ఆఫీసర్లు సంధ్యకిరణ్, వరలక్ష్మి, రాజు, ప్రసూనరాణి, శ్యాంసుందర్, తిరుమలరెడ్డి, డీపీహెచ్‌ఎన్‌ఓ వరలక్ష్మి, ఏఎస్‌ఓ తిరుమల్‌రెడ్డి, డీడీఎం రామాంజనేయులు, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment