ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌లో విధులు! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌లో విధులు!

Published Thu, Jan 9 2025 1:03 AM | Last Updated on Thu, Jan 9 2025 1:03 AM

ప్రభు

ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌లో విధులు!

..ప్రభుత్వ వైద్యుడు.. ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారనే దానికి ఈ ఘటనే నిదర్శనం. కేవలం గద్వాలలోనే కాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు పలువురు వైద్యసేవలను వ్యాపారమయంగా మార్చారు. సర్కారు ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించాల్సిన వారు.. కాసుల కక్కుర్తితో డుమ్మాలు కొడుతూ సొంత క్లినిక్‌లు, ప్రైవేట్‌ హాస్పిటళ్లలో ఓపీలు చూస్తూ, చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జనరల్‌ ఆస్పత్రులకు చెందిన పలువురు వైద్యుల ప్రైవేట్‌ విధులపై ‘సాక్షి’ ఫోకస్‌.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఈ ఫొటోలోని దంపతులు జమ్మన్న, కవిత దంపతులు. వారి ముగ్గురు పిల్లలను ఈ దృశ్యంలో చూడవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కవితను ఆమె భర్త ఇటీవల గద్వాల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్‌ ముక్కులో కండ పెరిగిందని.. చిన్న ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు. ఇక్కడ అలాంటి మిషన్‌ లేదని, మహబూబ్‌నగర్‌ లేదా కర్నూలుకు తీసుకెళ్లమన్నాడు. అంత స్థోమత లేదని వారు చెప్పడంతో.. తక్కువ ఖర్చుతో ఇక్కడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేస్తానని ఆ డాక్టర్‌ నమ్మబలికాడు. తెల్లారి కవితను సదరు ఆస్పత్రికి తీసుకు రాగా.. ఆపరేషన్‌కు తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ అంబులెన్స్‌లో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత ఆమె మృతి చెందింది.

పీజీ వైద్యులకు

బాధ్యతలు అప్పగించి..

జిల్లా జనరల్‌ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లా ఆస్పత్రుల్లో కీలక విభాగాలకు చెందిన వైద్యులు పలువురు ప్రైవేట్‌ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలు ప్రైవేట్‌ హాస్పిటళ్లలోనూ చికిత్సలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రాకను బట్టి కొందరు మధ్యాహ్నం 12 గంటల తర్వాత, మరికొందరు అంతకంటే ముందుగానే పీజీ వైద్యులకు బాధ్యతలు అప్పగించి.. క్లినిక్‌ల బాట పడుతున్నట్లు రోగుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టించుకోని ఉన్నతాధికారులు

ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదంటూ పలు ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైద్యుల సేవలను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది, మధ్యాహ్నం రెండు గంటలకు.. అంటే వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వైద్యులు హాజరును నమోదు చేసుకోవాలి. అయితే పలువురు వైద్యులు ఉదయం నిర్ణీత సమయానికి వచ్చి థంబ్‌ పెట్టి.. హాజరు నమోదు చేసుకుంటున్నారు. గంట, రెండు గంటల పాటు ఉండి గుట్టుచప్పుడు కాకుండా మాయమవుతున్నట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మళ్లీ వచ్చి హాజరు నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా జనరల్‌ ఆస్పత్రులకు సంబంధించిన ఉన్నతాధికారులు, అటు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్లినిక్‌లు, ప్రైవేట్‌ ఆస్పత్రుల వద్ద పెద్ద పెద్ద బోర్డులపై ప్రభుత్వ వైద్యుల పేర్లు బాహాటంగా కనిపిస్తున్నా.. చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రధానంగా గైనకాలజీ, పీడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో పని చేస్తున్న వైద్యులు ప్రైవేట్‌ ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని రవీంద్ర టాకీస్‌ చౌరస్తా, హౌసింగ్‌ బోర్డు కాలనీ, మెయిన్‌ రోడ్డు, శ్రీనగర్‌ కాలనీ, వక్ఫ్‌ బోర్డు సమీప ప్రాంతాల్లో ప్రైవేట్‌గా వైద్యసేవలందిస్తున్నారు.

వనపర్తి జనరల్‌ హాస్పిటల్‌లో గైనకాలజీ, పీడియాట్రిక్‌, జనరల్‌ సర్జన్‌ విభాగంలో పని చేస్తున్న వైద్యులు పలువురు కొత్త బస్టాండ్‌ సమీపంలో, వల్లభ్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తున్నారు. ఒకరు సొంతంగా హాస్పిటల్‌ పెట్టి.. చికిత్సలు చేస్తున్నట్లు సమాచారం.

గద్వాల జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో పీడియాట్రిక్‌, అనస్తీషియా, గైనకాలజీ, అఫ్తమాలిక్‌ విభాగాలకు చెందిన పలువురు వైద్యులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తున్నారు. కోర్టు సమీపంలో, కృష్ణవేణి చౌరస్తా, కొత్త బస్టాండ్‌ వెనుక భాగంలో ఏర్పాటు చేసుకున్న క్లినిక్‌లు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నారాయణపేట జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌, జనరల్‌ ఫిజిషియన్‌, డెంటిస్ట్‌, అనస్తీషియా విభాగాలకు చెందిన పలువురు డాక్టర్లు కలెక్టర్‌ బంగ్లా సమీపంలో, పాత బస్టాండ్‌ దగ్గర, శాతవాహన కాలనీతోపాటు తదతర ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్‌గా వైద్య సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌లో విధులు! 1
1/1

ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌లో విధులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement