పొగాకులో తేమ పేరుతో మోసం
అలంపూర్: పొగాకులో తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అలయన్స్–1 కంపెనీ వారు పొగాకు కొనుగోలులో జాప్యం చేయడంతో పాటు తేమ పేరుతో ధరలో కోత విధిస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా.. కంపెనీ ఉద్యోగులతో మాట్లాడారు. అగ్రిమెంట్ ప్రకారం రూ. 15,500 ధరకు కొనుగోలు చేయాల్సి ఉండగా.. తేమ పేరుతో రూ. 8వేలు, రూ. 10 వేలకు ఎలా కొంటారని నిలదీశారు. రైతులతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీలు పంటసాగు తర్వాత తేమ పేరుతో నష్టపర్చడం సరికాదన్నారు. పొగాకు రైతులకు సాగు వ్యయం భారీగా పెరిగిందన్నారు. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ధర ఇవ్వకపోవడం దారుణమన్నారు. తేమ పేరుతో ధరలో కోత పెడితే సహించేది లేదన్నారు. రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, ఈశ్వర్, నాగమల్లయ్య, రవి, జగన్మోహన్ రెడ్డి, సంజీవ రెడ్డి, నర్సింహ, రామకృష్ణ, సుధాకర్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, జగన్ గౌడ్, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment