మిగిలిన పనులు పూర్తిచేయండి
అయిజ: మున్సిపాలిటీలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని.. వాటిని వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెన వద్ద చేపట్టిన అప్రోచ్ రోడ్డు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. మార్కెట్‌కు ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని.. ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలంలో రోడ్డు డివైడర్‌ను ముందుకు కొనసాగించాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి కలెక్టర్ చేరుకొని అధికారులతో మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పూర్తిపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అనంతరం పట్టణంలో నిర్మించిన సీసీరోడ్లను కలెక్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. పీహెచ్‌సీ పక్కన చేపట్టిన 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణం పూర్తిచేసేందుకు గాను రూ. 50 లక్షలు మంజూరు చేయిస్తామని తెలిపారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి..
శాంతినగర్: పదో తరగతి వార్షిక పరిక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని మండలాల విద్యాధికారులు, హెచ్‌ఎంలతో ఎస్‌ఎస్‌సీ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 32వ స్థానంలో నిలిచిందని.. ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించి కనీసం 8వ స్థానానికి చేరుకునేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ప్రతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణతకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు గత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలన్నారు. రెండు నెలలపాటు కఠిన సాధన చేస్తే లక్ష్యం తప్పకుండా చేరుకుంటామని వివరించారు. అక్షరాస్యతలో జిల్లా పురోగతి సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఈఓ అబ్దుల్ ఘని తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment