విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి
రాజోళి: విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని ఉపాధ్యాయులకు సూచించారు. రాజోళి కొత్త ప్లాట్లలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సాహం అందించాలని సూచించారు. తద్వారా విద్యార్థులు తమ ఆలోచనలకు పదునుపెట్టి అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ భగీరథ రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు నిషాక్, ఎంవీ ఫౌండేషన్ మండల ఇన్‌చార్జి హన్మిరెడ్డి, సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ దస్తగిరి, రామాంజనేయులు, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
11 మంది బాలకార్మికుల గుర్తింపు
గద్వాల క్రైం: వ్యవసాయ పొలాల్లో బాలలతో పనులు చేయిస్తున్న యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గద్వాల మండలంలోని కుర్వపల్లికి చెందిన కుర్వ పరుశరాముడు తన వ్యవసాయ పొలంలో 11 మంది బాలలతో పనులు చేయిస్తుండగా.. ఆపరేషన్ స్మైల్ బృందం గుర్తించారన్నారు. బాలకార్మికుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా చిన్నారులను పనిలోకి పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాలకార్మికులను గుర్తించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
క్రీడాస్ఫూర్తి చాటాలి
మల్దకల్: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి చాటాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ తిమ్మారెడ్డి, రాజారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సత్యారెడ్డి, విక్రంసింహారెడ్డి, చక్రధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పెద్ద వీరన్న, వెంకటన్న, సవారి, అజయ్, నరేందర్, మధు, నారాయణ, ఆంజనేయులు, పరుశరాముడు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ. 6,160
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 849 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,160, కనిష్టంగా రూ. 3,421, సరాసరి రూ. 6,060 ధరలు పలికాయి. 22 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 5,569, కనిష్టంగా రూ. 5,469, సరాసరి రూ. 5,529 ధరలు లభించాయి. 72 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,359, కనిష్టంగా రూ. 2,089, సరాసరి రూ. 2316 ధరలు వచ్చాయి. 187 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 7,606, కనిష్టంగా రూ. 5,059, సరాసరి రూ. 7,351 ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment