‘ముక్కోటి’ దండాలు
గద్వాల టౌన్: మహా విష్ణువును ముక్కోటి దేవతలు నేరుగా దర్శించి ఆశీస్సులు పొందిన వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. ఎంతో విశిష్టత కలిగిన ఏకాదశి పర్వదినాన శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు వేంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకొని తరించారు. జిల్లాకేంద్రంలోని కోటలో వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామిని, కృష్ణానది తీరాన శ్రీకల్యాణలక్ష్మీవేంకటేశ్వరస్వామి, భీంనగరలోని సంతాన వేణుగోపాలస్వామి, గంజిపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి, అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి, మల్దకల్ స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి, అయిజ మండలం ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, బీచుపల్లిలోని కోదండరామస్వామి, కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి తదితర ఆలయాల్లో తెల్లవారుజామున భక్తులు స్వామివార్లను దర్శించుకొన్నారు. ముందుగా స్వామివారిని పల్లకీపై ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చారు. అంతకు ముందు ఆలయాల్లో సుప్రభాతం, అలంకరణ సేవ, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment