సాగు సంబురం
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధి ఆయకట్టు రైతులు యాసంగి వరిసాగు పనుల్లో నిమగ్నమయ్యారు. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో కేవలం 20 వేల ఎకరాలకే సాగునీరు వదలనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి మహిళా కూలీల కొరత ఉండటంతో అధిక కూలి చెల్లించి నాట్లు పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరేళ్లుగా ఆయకట్టుకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఈసారి కూడా అదే పద్ధతిన నీటిని వదలనున్నారు. ఐఏబీ సమావేశంలోనూ నీటి విడుదల, ఆయకట్టు విస్తీర్ణం కేవలం 20 వేల ఎకరాలేనని అధికారులు ప్రకటించారు.
కేవలం మూడు మండలాలకే..
యాసంగిలో అమరచింత, ఆత్మకూర్ మండలాలతో పాటు రామన్‌పాడ్ రిజర్వాయర్ పరిధి మొత్తం కలిపి కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించనున్నారు. దీంతో జూరాల ఎడమ కాల్వ పరిధిలోని మూడు మండలాల్లో మాత్రమే వరి సాగు పనులు కొనసాగుతున్నాయి. 37 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ నుంచి అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల రైతులకు సాగునీరు అందితోంది. ఐదేళ్ల కిందట వీపనగండ్ల మండలంలోని రైతులకు సాగునీరు అందక నష్టపోయేవారు. దీంతో ఈ ఏడాది ఆయకట్టు దిగువ మండలాలకు సాగునీరు అందించలేమని ముందస్తుగా ప్రకటించి ఆయా గ్రామాల్లో టాంటాం వేయించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులు కాల్వకు నీరు వదలడం.. మిగిలిన మూడు రోజులు నీటిని నిలిపివేయడం జరుగుతోంది.
సన్నరకం సాగుకు ఆసక్తి..
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలంలో సన్నరకం పండించిన రైతులకు క్వింటాకు బోనస్‌గా రూ.500 చెల్లించింది. దీంతో ఈసారి కూడా అవేరకాలు పండించేందుకు శ్రీకారం చుట్టారు. ఎక్కువగా సోనామసూరి, ఆర్‌ఎన్‌ఆర్ రకాల సాగుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు.
జూరాల ఆయకట్టులో ఊపందుకున్న వరిసాగు
ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాలు
వారబందీ విధానంలో
పంటలకు సాగునీరు
Comments
Please login to add a commentAdd a comment