పథకాల అమలు నిరంతర ప్రక్రియ
ధరూరు: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ధరూరు, మన్నాపురం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా పథకాలకు అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుందన్నారు. పంటసాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతుభరోసా కింద ఎకరాకు రూ. 12వేల పెట్టుబడి సాయం జమ అవుతుందన్నారు. భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో రూ. 12 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులను నిర్ధారిస్తామని తెలిపారు. అర్హుల జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం : ఎమ్మెల్యే బండ్ల
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే గ్రామ, వార్డు సభలను నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 2లక్షల రుణమాఫీ, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు వివరించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జిల్లా ప్రత్యేకాధికారిణి షకీలా భాను, ఎంపీడీఓ మంజూల, తహసీల్దార్ వెంకట్రావు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జాంపల్లి వెంకటేశ్వరరెడ్డి, డీఆర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
అర్హులందరూ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment