నాణ్యమైన కందికి మద్దతు ధర
అలంపూర్: నాణ్యమైన కంది ధాన్యానికి కేంద్రాల్లో ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర లభిస్తోందని మార్క్‌ఫెడ్ డీఎం గౌరి నాగేశ్వర్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ డీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు చోట్ల కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు, మొదట అలంపూర్ చౌరస్తాలో అందుబాటులోకి తెచ్చామన్నారు. నిబంధనల మేరకు కేంద్రానికి తెచ్చిన నాణ్యమైన కందికి క్వింటాకు రూ.7550 మద్దతు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. కేంద్రాల్లో విక్రయించే రైతుల కంది సాగు వివరాలు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదై ఉండాలని, పోర్టర్ ఆధారంగా ముందుగా ఏఈఓతో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలని, ఆ పత్రాన్ని కేంద్రాల్లోని ఆన్‌లైన్ పోర్టల్‌లో సరి చూసుకోవాలని, ఆ తర్వాత నాణ్యమైన గింజలను కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రస్తుతం ఒక ఎకరానికి 3.31 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయనుండగా.. రైతుల అభిప్రాయం మేరకు ఒక ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని కోరుతుండటంతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఒక రైతుకు చెందిన పంట సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉంటే ఎన్ని ఎకరాల ధాన్యమైన కొనుగోళు చేస్తామన్నారు. రైతులు సహకరించి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ దొడ్డెన్న, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం గౌరి నాగేశ్వర్, మార్కెట్ యార్డు కార్యదర్శి ఎల్లస్వామి, అశోక్, నాగేష్, యువరాజు, డైరెక్టర్లు సులోచనమ్మ, నాగరాజు. కృష్ణయ్య, మస్తాన్, రుక్మానంద రెడ్డి, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment