![పప్పుధాన్యాల సాగుకు.. ప్రోత్సాహం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/06alp01-210012_mr-1739042141-0.jpg.webp?itok=zJez6ewj)
పప్పుధాన్యాల సాగుకు.. ప్రోత్సాహం
అలంపూర్: ఏటికేడు పప్పుదినుసుల సాగు తగ్గుతూ వస్తోంది.. రైతులకు సరైన దిగుబడి రాకపోవడం.. మద్దతు ధర అందకపోవడమూ ఓ కారణం. ఇదిలాఉండగా, పప్పుదినుసుల సాగు తగ్గితే మార్కెట్‌లో తీవ్ర కొరత నెలకొనే ప్రమాదం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పప్పుదినుసుల సాగు పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈమేరకు జాతీయ ఆహార భద్రత పథకం ద్వార పప్పుదినుసుల పంట విత్తనాలు వంద శాతం సబ్సిడీపై ఉచితంగా అందిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనువుగా ఈ పథకం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలోని మూడు మండలాలను ఎంపిక చేసి పప్పుదినుసుల్లో ప్రధానంగా ఉన్న మినుము విత్తనాలు ఉచితంగా అందిస్తోంది.
మూడు మండలాల ఎంపిక
జిల్లాలో ఆహార భద్రత పథకం కింద మినుము విత్తనాల పంపిణీకి ప్రస్తుతం మూడు మండలాలు అలంపూర్, ఎర్రవల్లి, ఉండవెల్లిని ఎంపిక చేశారు. నీటి లభ్యతోపాటుగా మినుములు అధికంగా సాగు చేసే ప్రాంతాలు కావడంతో వీటిని ఎంపిక చేసినట్లు సమాచారం. జిల్లాకు 500 ప్యాకెట్ల మినుములు వచ్చాయి. ఒక్కో దాంట్లో 4 కిలోల విత్తనాలు ఉంటాయి. అలంపూర్, ఎర్రవల్లి మండలానికి 8 క్వింటాళ్ల చొప్పున 16 క్వింటాళ్లు, ఉండవెల్లి మండలానికి 4 క్వింటాళ్లు సరఫరా చేశారు. సాగు చేసే రైతులను ఎంపిక చేసి వాటిని వంద శాతం సబ్సిడీపై ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతం మండలాల్లో వీటి పంపిణీ ప్రారంభించారు.
సాగు పెంచడమే లక్ష్యం
దేశంలో పెరుగుతున్న ఆహార ఉత్పత్తులు పెంచడమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాతరవణ పరిస్థితులకు అనువుగా కొత్తరకం విత్తనాలను అందుబాటులోకి తేవడానికి వ్యవసాయ శాఖ నిరంతరం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రతి ఏడాది పప్పుదినుసు విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు. సాగు చేసిన పంట నాణ్యత ప్రమాణాలు, దిగుబడులను అంచనా వేసి మరింత పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పప్పుదినుసుల సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. పప్పుదినుసుల సాగు పెంచడానికి ఆహార భద్రత పథకం ద్వారా తగ్గుతున్న సాగును గుర్తించి ఆయా ప్రాంతాల్లో పప్పుదినుసుల విత్తనాలను ఉచితంగా అందిస్తు సాగును ప్రొత్సహిస్తున్నారు. వాతావరణంలో అనేక మార్పులు సంభివిస్తుంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల విత్తనాలు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. దీంతో వ్యవసాయ శాఖ పరిశోధనలు చేసి కొత్తరకం విత్తనాలను ఉత్పత్తి చేసి.. ఈ రకం విత్తనాలను ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా సాగు చేస్తోంది గమనించడానికి ఎక్కువ మొత్తంలో పంట సాగు చేసే రైతులను ఎంపిక చేసి ఒక ఎకరం లేదా రెండు ఎకరాల్లో వాటి పరిశీలనలు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఏడాది కొంత మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేస్తున్నారు.
వంద శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు
జిల్లాకు 20 క్వింటాళ్లు మంజూరు
అలంపూర్, ఎర్రవల్లి, ఉండవెల్లి
మండలాలు ఎంపిక
జాతీయ ఆహార భద్రత పథకం
కింద పంపిణీ
పప్పుదినుసుల సాగు పెంచడమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment