![వైభవం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/11022025-jud_tab-01_subgroupimage_1883337616_mr-1739221527-0.jpg.webp?itok=RppxAyU0)
వైభవంగాసీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భానుమూర్తి, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాములను ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు కాల్వకు నీటి విడుదల
గట్టు: ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా గట్టు మండలంలో ప్రవహిస్తున్న కాల్వకు సోమవారం నీటి విడుదల చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ర్యాలంపాడు కాల్వకు నీటి విడుదల జాప్యం కావడంతో పంటలు వాడుముఖం పట్టాయి. దీంతో ఇన్నాళ్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’లో ‘నీటి కోసం ఎదురుచూపులు’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి నీటి పారుదల అధికారులు స్పందించారు. ర్యాలంపాడు కాల్వకు నీటిని విడుదల చేయడంతో పెంచికలపాడు, ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి, గట్టు, మాచర్ల, బల్గెర, ఇందువాసి గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాల్వ కింద సాగు చేసుకున్న వరి, వేరుశనగ, పొగాకు పంటలకు ఎట్టకేలకు సాగు నీటి శాఖ అధికారులు నీటిని విడుదల చేయడంతో పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి గ్రామాల మధ్య కాల్వను పరిశీలించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. పంటలు ఎండిపోకుండా చూస్తామని హామీ ఇచ్చి వెళ్లినట్లు రైతులు తెలిపారు. కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
37 మందికి హెచ్‌సీలుగా పదోన్నతి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్న 37 మంది కానిస్టేబుల్స్‌కు హెడ్‌కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పి స్తూ సోమవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మందికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐదుగురికి, వనపర్తిలో ఆరుగురికి, గద్వాలలో ముగ్గురికి, నారాయణపేట జిల్లాలో ఒకరికి హెడ్‌కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించారు. వీరిలో మహబూబ్‌నగర్‌లో ఒకరికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో 13 మందికి, వనపర్తిలో ఆరుగురికి, గద్వాలలో ఆరుగురు, నారాయణపేట జిల్లాలో 9 మందికి, ఇంటలిజెన్స్‌లో ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్స్ రెండు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
సూర్యప్రభవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం రాత్రి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, రకరకాల పూల అలంకరణల మధ్య స్వామివారు భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.
![వైభవంగాసీతారాముల కల్యాణం
1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/11022025-jud_tab-01_subgroupimage_1883416000_mr-1739221527-1.jpg)
వైభవంగాసీతారాముల కల్యాణం
![వైభవంగాసీతారాముల కల్యాణం
2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10alp451-210141_mr-1739221528-2.jpg)
వైభవంగాసీతారాముల కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment