![నయనానందం.. చెన్నకేశవుడి తెప్పోత్సవం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11gdl103-210033_mr-1739302138-0.jpg.webp?itok=4emn8KJk)
నయనానందం.. చెన్నకేశవుడి తెప్పోత్సవం
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి తెప్పోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా రాత్రి 9 గంటల ప్రాంతంలో సంస్థానాధీశుల కాలంనాటి లింగంబావిలో తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుద్ధీపాలతో సుందరంగా అలంకరించిన లింగంబావిలో స్వామివారు విహరించారు. అంతకుముందు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పండితులు కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెన్నకేశవస్వామి మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం, కలశాలకు ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు చేపట్టారు. కాగా, శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు.. మంత్రాలయ రాఘవేంద్రస్వామి పండితులచే ప్రత్యేక పూజలు.. జములమ్మ దేవతను కొలిచేందుకు వస్తున్న భక్తుల తాకిడితో జిల్లా కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం కనిపించింది.
● గద్వాల కోటలో శ్రీభూలక్ష్మీ చెన్నకేశవ స్వామిని కలెక్టర్ సంతోష్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి గరుడవాహన సేవలో పాల్గొన్నారు.
నేడు రథోత్సవం..
భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి మహా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ విచారకర్త ప్రభాకర్ తెలిపారు. రథోత్సవానికి మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి హాజరవుతున్నారని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హజరై రథోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment