బడి నుంచే ఉపాధి పాఠం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ విద్యా విధానంలో భాగంగా సరికొత్త చదువులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రాయోజిత కార్యక్రమాలతో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందుతోంది. జిల్లాలో ఎంపిక చేసిన 37 పాఠశాలల్లో వృత్తి విద్యాబోధన సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే బలమైన పునాదులు పడ్డాయి.
అమలవుతున్న కోర్సులివే..
అగ్రికల్చర్, ఆటోమోటివ్, ఐటీ–ఐటీఈ, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, రిటైల్, అపెరల్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వృత్తి విద్యాకోర్సులు అమలవుతున్నాయి. వీటిలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకే కల్పిస్తున్నారు. పాఠశాల ప్రతిరోజూ ఒక పీరియడ్, ప్లస్ టూలో వారంలో తప్పని సరిగా మూడు పీరియడ్లు వృత్తి విద్యా కోర్సులు బోధించేలా షెడ్యూల్ వేశారు. మరో మూడు పీరియడ్లు ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ విద్యార్థులు ఆయా కోర్సులో ప్రావీణ్యం పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పీఎంశ్రీ పాఠశాలలో ప్రయోగాలు..
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు దూసుకువెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగా తొలి విడతలో ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఏంశ్రీ) పథకం కింద ఎంపిక చేసిన 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ల్యాబ్‌కు రూ.15.5 లక్షల చొప్పున వెచ్చించారు.
నైపుణ్య హాబ్‌లు..
పాఠశాల స్థాయిలో నైపుణ్యంతో కూడిన చదువులకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 20 పాఠశాలల్లో ఏర్పాటుకు ఒకొక్క దానికి రూ.ఐదు లక్షల చొప్పున కేటాయించారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాఠశాల పనిదినాల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తూ సెలవు రోజుల్లో వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులను క్షేత్ర సందర్శనకు తీసుకువెళ్తారు. పాఠశాలకు సమీపంలో కుటీర, మధ్య తరగతి పరిశ్రమలు, చేతి వృత్తి కేంద్రాలు, బ్యూటీషియన్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సరిపోల్చుతూ మరింత అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకుని సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఉపాధి పొందేలా తర్ఫీదు..
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు స్వశక్తిపై నిలబడేలా జిల్లాలో ఎంపిక చేసిన 37 పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో ఇద్దరు చొప్పున బోధకులను నియమించారు. వీరు 9, 10వ తరగతి, ప్లస్‌టూ స్కూళ్లలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఒక్కో ట్రేడ్‌కు 50 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ పూర్తయ్యేసరికి ప్రతి విద్యార్థి తమకు నచ్చిన రెండు కోర్సుల్లో నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను సమగ్రశిక్ష అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
విద్యార్థులకు ఎంతో మేలు..
వృత్తి విద్యాకోర్సులతో ఎంతో మేలు జరుగుతుంది. ఉన్నత అఽధికారుల సూచనలకు అనుగుణంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వృత్తి విద్యను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. స్కూళ్లను తరచూ సందర్శించి విద్యార్థుల ప్రగతిపై సమీక్షిస్తున్నాం.
– యు.ఉమా మహేశ్వరి, జీసీడీఓ, సమగ్రశిక్ష
జిల్లాలో ఎంపిక చేసిన
37 పాఠశాలల్లో నైపుణ్య శిక్షణ
9, 10 ప్లస్ టూ విద్యార్థులకు తర్ఫీదు
ఎన్‌ఈపీ అమలులో భాగంగా కోర్సులు
పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రయోగశాలలు
Comments
Please login to add a commentAdd a comment