సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు
● 10.500 గ్రాముల బంగారం..
410 గ్రాముల వెండి సమర్పణ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుడికి గత 30 రోజులకు హుండీల ద్వారా రూ.1,22,41,967 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను తెరిచి లెక్కించగా నగదు రూ.1,18,20,962, చిల్లర నాణాలు రూ.4,21,005 వచ్చాయ చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు. వీటితో బాటు బంగారం 10.500 గ్రాములు, వెండి 410 గ్రాములు వచ్చిందని తెలిపారు. 30 రోజుల్లో సరాసరిన రోజుకు రూ.4,08,065 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
హుండీలలో విదేశీ కరెన్సీ
సత్యదేవుని దర్శించిన పలువురు ఎన్‌ఆర్‌ఐలు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని హుండీలలో సమర్పించారు. వాటిలో అమెరికా డాలర్లు 117, కెనడా డాలర్లు 220, యూరోలు వంద, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 109, ఆస్ట్రేలియా డాలర్లు 50, ఒమెన్ రియల్స్ ఒకటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 105, ఇంగ్లాండ్ పౌండ్లు పది, టర్కీ లీరాలు ఐదు, కువైట్ దీనార్లు ఒకటి వచ్చాయి. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
నమూనా ఆలయం వద్ద దివీస్ ఆర్వో ప్లాంట్
జాతీయ రహదారిపై నిర్మించిన సత్యదేవుని నూతన నమూనా ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ‘దివీస్ లాబరేటరీస్’ ఏర్పాటు చేసిన వేయి లీటర్ల సామర్థ్యం ఉన్న ఆర్వో ప్లాంట్‌ను బుధవారం ఆలయ ఈఈ వి.రామకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ వి.సత్యనారాయణ ప్రారంభించారు. అన్నవరం దేవస్థానంలో దివీస్ సంస్ద ఇప్పటి వరకు రూ.1.4 కోట్లతో వేయి లీటర్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది ఆర్వో వాటర్ ప్లాంట్లు, ఏడు జలప్రసాద కేంద్రాలు, ఎనిమిది వాటర్ కూలర్లు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో దివీస్ ప్రతినిధులు సుధాకర్, వాసుబాబు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment