ఈవీఎం, వీవీ ప్యాట్‌లకు పటిష్ట భద్రత
కాకినాడ సిటీ: ఈవీఎం, వీవీప్యాట్‌లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును ఆయన రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపకశాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లు తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల రక్షణకు కార్యాచరణ
చిన్నారులను రక్షించేందుకు ప్రతి విభాగంలోని అధికారులు సంయుక్త కార్యాచరణ రూపొందించుకుని మండల, గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో చిన్నారి రక్షణపై జిల్లా అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల వాహన డ్రైవర్లు, క్లీనర్లకు, ఆటో డ్రైవర్లకు చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ భావన, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కె.ప్రవీణ, రిసోర్సపర్సన్ బి.పద్మావతి, సీహెచ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు
కాకినాడ సిటీ: జిల్లాలో నవంబర్ 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 2 లక్షల 74వేల 740 మందికి రూ.115.64 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ఒకటో తేదీనే నూరుశాతం పెన్షన్ల పంపిణీకి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు.
ఎయిర్‌పోర్ట్ వద్దని వినతి
తొండంగి: పచ్చని పొలాల్లో ఎయిర్‌పోర్టు పెట్టి తమ పొట్ట కొట్టవద్దని బెండపూడి, పీఈ చిన్నాయపాలెం రైతులు తహసీల్దార్ మురార్జీకి బుధవారం వినతిపత్రం అందజేశారు. బెండపూడి నుంచి రెండు గ్రామాల రైతులు బైక్‌ర్యాలీగా గోపాలపట్నంలో రీసర్వే గ్రామసభలో ఉన్న తహసీల్దార్ మురార్జీకి వినతిపత్రం అందజేశారు. పచ్చని పొలాల్లో ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదనలు పంపారని దాదాపు 1200 మంది రైతులు జీవనోపాధి కోల్పోతామని, ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు జీవనాధారం కోల్పోతామని వాపోయారు. రెండు పంటల ద్వారా వ్యవసాయ రైతులతో పాటే పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలు కూలి పనులతో జీవిస్తున్నామన్నారు. వీరందరికీ తీరని నష్టం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతులు పాలచెర్ల సుబ్బారావు, పాలచెర్ల బాబూరావు, మోగంటి సూర్యనారాయణ, రాయవరపు ఆనంద్, బొబ్బిలి వెంకన్న, జి.సత్యనారాయణ, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ డే
పరేడ్‌కు గైట్ విద్యార్థిని
రాజానగరం: జాతీయ సేవా పథం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 12 నుంచి 21 వరకు జరిగే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కి ఆంధ్రా యూనివర్సిటీ తరఫున గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ ఫర్జానా ఆష్మీ మొహ్మద్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి ధనరాజ్ తెలిపారు. కేబీసీ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ(జలగావ్)లో జాతీయ స్థాయిలో ఈ పరేడ్ జరుగనుంది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌పీఓ షేక్ మీరా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment