ఎమ్మెల్యేకు సొమ్ములివ్వలేదని షెడ్ కూల్చేశారు
కాకినాడ రూరల్: సర్పవరం ఆటోనగర్ పెట్రోల్ బంక్ సమీపంలో షెడ్ కూల్చివేత స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ఆటోనగర్‌లోని తన బంధువుల స్థలంలో జనసేన కార్యకర్త ఆకుల బాలరాజు షెడ్ ఏర్పాటు చేసుకుని టీ దుకాణానికి లీజుకు ఇచ్చారు. ఇంతలో పంచాయతీ కార్యదర్శి పబ్బినీడి శ్రీనివాస్ తన సిబ్బందితో వచ్చి అనుమతి ఆ నిర్మాణాన్ని బుధవారం కూల్చివేశారు. ఈ విషయమై బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ ఈ తతంగానికి ఎమ్మెల్యే నానాజీయే కారణమని ఆయనకు రూ.10 లక్షలు ఇవ్వనందుకే ఈ చర్యకు పంచాయతీ సిబ్బందిని పురిగొలిపారని ఆరోపించారు. తాను నిర్మించిన షెడ్‌కు వెనక ఉన్న స్థలంలో షెడ్ పెట్టుకోవాలని కోరారని, అందుకు తాను అంగీకరించకపోవడంతో ఆ స్థలం యజమానికి మద్దతుగా వ్యవహరించి తనను డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. తన షెడ్ ఆ వెనుక స్థలానికి ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయమై తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. అలాగే తాను నిర్మించిన స్థలం విషయమై తమ యజమాని ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని, ఈ లోపే నిర్మాణాన్ని తొలగించారని వాపోయారు. కాగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను వివరణ కోరగా షెడ్‌ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించారని కోడిగుడ్డు వెంకటేశ్వరరావు ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ విషయమై సమీక్షించిన అనంతరం కలెక్టర్ షెడ్ కూల్చివేతకు ఎంపీడీఓకు ఆదేశాలు ఇచ్చారని ఆ మేరకు తాము ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అయితే సర్పవరంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఎన్నో ఆక్రమణలు ఉన్నప్పటికీ ఎవరికీ అడ్డులేని కట్టడాన్ని ఆగమేఘాలపై కూల్చివేయడం విమర్శలకు తావిస్తోంది.
రూ.10 లక్షలు డిమాండ్ చేశారు
సర్పవరంలో జనసేన కార్యకర్త ఆరోపణ
పవన్‌కల్యాణ్‌కు
ఫిర్యాదు చేస్తానని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment