ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఫ ఒప్పందం మేరకు జీఓలు విడుదల చేయాలి
ఫ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా
కాకినాడ సిటీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, ఒప్పందం మేరకు జీఓలు, సర్క్యులర్లు విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్‌కుమార్ ప్రసంగించారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఆశా కార్యకర్తల పోరాట శిబిరాల వద్దకు వచ్చి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. పైగా ఈ ఆరు నెలల్లో నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీనికి తోడు కరెంటు చార్జీలు పెంచారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఒప్పందంలో భాగంగా రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.60 వేలకు సంబంధించిన జీఓ విడుదల చేయాలని, సర్వీసులో చనిపోయిన ఆశా కార్యకర్త కుటుంబానికి ఇన్సూరెన్స్ వర్తింపజేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆన్‌లైన్ సర్వేల పేరుతో మోపుతున్న పని భారాన్ని తగ్గించాలని, రికార్డు బుక్కులు ప్రభుత్వమే ఇవ్వాలని అన్నారు. తమకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం చేయించిన లెప్రసీ, టీబీ సర్వే పారితోషికాలను తక్షణమే విడుదల చేయాలని, స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు అంగన్‌వాడీ యూనియన్ కాకినాడ సిటీ కార్యదర్శి జ్యోతి, జిల్లా కోశాధికారి రమణమ్మ, అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సంఘం నాయకులు నాయుడు, రాజారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా రమణ మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జె.నరసింహ నాయక్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సెంటర్ వరకూ ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment