సాంకేతిక పరిజ్ఞానం పెంపునకే స్టెమ్ ల్యాబ్‌లు
ఫ 49 పాఠశాలల్లో ఏర్పాటు
ఫ కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి
ఫ బెండపూడి జెడ్పీ హైస్కూల్లో ప్రారంభం
తొండంగి: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకే పాఠశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాఽఽథమెటిక్స్ (స్టెమ్) విద్యా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బెండపూడి జెడ్పీ హైస్కూల్లో స్టెమ్ ల్యాబ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రొబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై కంప్యూటర్ల ద్వారా ప్రాథమిక అవగాహన కల్పించడం ద్వారా టెన్త్ పూర్తయిన అనంతరం విద్యార్థులు ఆయా రంగాల్లో రాణించేలా కేంద్ర ప్రభుత్వం స్టెమ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. జిల్లాలోని 49 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయని తెలిపారు. వీటిని స్టార్పెచ్ ఇన్నోవేషన్స్ సంస్థ నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా పంచ్ పతాకా చాలెంజ్ ఎగ్జామ్‌ను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్, జిల్లా సైన్స్ అధికారి మైలపల్లి శ్రీనివాస్ వినీల్, స్టార్పెచ్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు అవనిగడ్డ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టు వద్దు
ఇదిలా ఉండగా బెండపూడి వచ్చిన కలెక్టర్ షణ్మోహన్‌ను విమానాశ్రయ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యాన బెండపూడి, అన్నవరం, పీఈ చిన్నాయపాలెం గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో కలిశారు. పచ్చని పంట పొలాల్లో ఎయిర్‌పోర్టు వద్దని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తరతరాలుగా 1,200 మంది రైతులతో పాటు వేలాది కుటుంబాలు వ్యవసాయమే జీవనాధారంగా రెండు పంటలు సాగు చేసుకుంటూ ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నాయని వివరించారు. ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదించిన భూములకు సంబంధించి చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను మరోచోటుకు తరలించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment