గురుకుల బాలికలకు బంగారు పతకాలు
తుని రూరల్: ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ ఏలూరు జిల్లా పొలసానిపల్లిలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో వి.కొత్తూరు గురుకుల విద్యార్థినులు బంగారు పతకాలు సాధించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో తమ విద్యార్థినులకు బంగారు, వెండి, కాంస్య పతకాలు లభించినట్టు వి.కొత్తూరు గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ టి.నిర్మల కుమారి సోమవారం తెలిపారు. సీనియర్ విభాగంలో కె.లావణ్య షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్, హైజంప్‌లో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో ద్వితీయ స్థానం సాధించిందని వివరించారు. జూనియర్ విభాగంలో వి.భవాని వంద మీటర్ల పరుగులో రజత పతకం సాధించిందన్నారు. క్యారమ్స్ డబుల్స్‌లో మీనాక్షి, చందు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. లాంగ్ జంప్, హై జంప్‌లో సీహెచ్.రమ్యశ్రీ బంగారు, హై జంప్‌లో సీహెచ్ శిరీష రజత పతకాలు సాధించారని తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థినులను, పీడీ ఆర్.జయలక్ష్మి, పీఈటీ సుజాతలను జిల్లా డీసీఓ జి.వెంకట్రావు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
పీజీఆర్‌ఎస్‌కు 314 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు వివిధ సమస్యలపై 314 అర్జీలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ షణ్మోహన్, డీఆర్‌ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్‌సీజీ రత్నమణి, కేఎస్‌ఈజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి, సీపీవో త్రినాథ్ అర్జీ లు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, రేషన్ కా ర్డు, ఉద్యోగ, ఉపాధి, డ్రైనేజీ సమస్యలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాల ఆన్‌లైన్, ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 43 ఫిర్యాదులు
కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వివిధ ప్రాంతాలకు చెందిన 43 మంది ఫిర్యాదులు చేశారు. వీటిని తక్షణ పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
ఏసీబీ వలలో మండల సర్వేయర్
రంగంపేట: మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ వలలో చిక్కారు. లంచం తీసుకుంటూండగా రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమా ర్ తమ సిబ్బందితో కలసి దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగంపేట మండలం ఈలకొలను గ్రామానికి చెందిన బాధితుడు బత్తిన రాముడు కథ నం ప్రకారం.. ఆయన తల్లికి సంబంధించి 1.34 ఎకరాలు, 66 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించిన సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయని, వాటిని సరి చేయాలని విలేజ్ సర్వేయర్ సోని ప్రియాంకకు రాముడు ఫిర్యాదు చేశారు. ఎనిమిది నెలలుగా తిరు గుతున్నా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో విలేజ్ సర్వేయర్‌ను ప్రశ్నించారు. ఆమె సూచన మేర కు మండల సర్వేయర్ ధర్మారావును కలిశారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్లు సరి చేయడానికి నెల రోజుల కిందట ధర్మారావు, సోని ప్రియాంక రూ.1.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని రాముడు చెప్పగా, తాము జేసీ, తహసీల్దార్ తదితరులకు సొమ్ము ఇవ్వాలని, అప్పుడే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. చివరకు రూ.75 వేలు ఇస్తేనే సమ స్య పరిష్కారమవుతుందని, లేకపోతే అవదని చెప్పా రు. ఈ నేపథ్యంలో రాముడు ఈ నెల 14న ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, సోమవారం సాయంత్రం రూ.75 వేలు లంచం తీసుకుంటూండగా ధర్మారావును పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించనున్నారు. తన సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ యు.రంజిత్‌కుమార్‌ను సోమవారం సాయంత్రం కూడా కలవగా.. ఎలక్షన్ పనిలో బిజీగా ఉన్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారని రాముడు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ ఎన్‌వీ భాస్కరరావు, డి.వాసుకృష్ణ, వై.సతీష్ పాల్గొన్నారు.
18ఎండీపీ204: ఏసీబీకి పట్టుబడిన మండల సర్వేయరు ధర్మారావు
Comments
Please login to add a commentAdd a comment