కిక్కిరిసిన రత్నగిరి
ఫ సత్యదేవుని దర్శించిన 90 వేల మంది
ఫ 9 వేల వ్రతాలు
ఫ రూ.కోటి ఆదాయం
అన్నవరం: కార్తిక మాసం మూడో సోమవారం పర్వదినం కావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ సత్యదేవుని ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా జనసందోహంతో కిక్కిరిసిపోయింది. దేవస్థానం ఘాట్ రోడ్లు, మల్టీ లెవెల్ పార్కింగ్ స్ధలాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో సుమారు 90 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని దర్శించిన భక్తులు వాహనాల్లో కొండ దిగువకు రావడంతో అన్నవరం మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు కూడా రద్దీగా మారిపోయాయి. పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రికార్డు స్థాయిలో 9 వేల సత్యదేవుని వ్రతాలు జరిగాయి. వ్రత మండపాలు ఖాళీ లేకపోవడంతో భక్తులను కంపార్ట్‌మెంట్లలోనే నిలిపివేశారు. ఖాళీ అయిన అనంతరం లోపలకు అనుమతించారు. ఆదివారం రాత్రికే సుమారు 30 వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకున్నారు. దీంతో స్వామివారి ఆలయాన్ని వేకువజామున ఒంటిగంటకు తెరచి, వ్రతాలు ప్రారంభించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. వ్రత, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామివారి అంతరాలయ దర్శనం టికెట్టు తీసుకున్న భక్తులను కూడా వెలుపల నుంచే దర్శనానికి అనుమతించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.కోటి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దీనిలో వ్రతాల ద్వారానే సుమారు రూ.55 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.30 లక్షలు సమకూరాయి. ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు. సుమారు 15 వేల మంది భక్తులకు ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment