ఖనికట్టు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ అండదండలతో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అడ్డగోలుగా అందినంతా దోచుకుపోతున్నారు. అధికారులు మాత్రం జీ హుజూర్ అంటూ కళ్లప్పగించి చూస్తున్నారు. అధికారం పంచుకున్న తరహాలోనే అవినీతి, అక్రమాల్లో సైతం నీకు సగం, నాకు సగం అంటూ తెలుగుదేశం, జనసేన నేతల మధ్య పంపకాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. మెట్ట ప్రాంత కేంద్రం జగ్గంపేటలో కూటమి నేతలు అక్కడి ప్రజాప్రతినిధుల పేరు చెప్పి చైనా క్లే (విలువైన సుద్దమట్టి) ఎత్తుకుపోయారు. అదీ కూడా రెవెన్యూ అధికారుల స్వాధీనంలో ఉన్న రూ.లక్షల విలువైన సుద్దమట్టి. అది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి మైనింగ్ అధికారులు సీజ్ చేసి అధికారికంగా అక్కడి తహసీల్దార్‌కు అప్పగించినదే కావడం గమనార్హం. ఎంతటి ధైర్యం, తెగింపు, నాయకుల అండదండలు ఉండకుంటే రెవెన్యూ యంత్రాంగం స్వాధీనంలో ఉన్న విలువైన చైనా క్లేను మాయం చేసేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు తెలియకుండా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్సార్ సీపీ హయాంలో
అక్రమాలపై ఉక్కు పాదం
నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఖనిజం (చైనా క్లే–సిరామిక్స్ టైల్స్‌లో వినియోగించే ఖరీదైన సుద్దమట్టి) ఉంది. ప్రధానంగా మర్రిపాక– రామవరం – గుర్రంపాలెం రోడ్డుకు ఆనుకుని చైనా క్లే ఖనిజ వనరులున్నాయి. వీటిలో ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న రామవరంలో రెవెన్యూ యంత్రాంగం అధీనంలో ఉన్న చైనా క్లేను రాత్రికి రాత్రి తరలించేసినా మండల రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం వెనుక కూటమి నేతల ఒత్తిళ్లు బలంగా పనిచేస్తున్నాయి.
సిరామిక్స్‌కు ఉపయోగించే ఈ సుద్దమట్టిని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో అక్రమంగా తవ్వి కూటమి నేతలు రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి అధికారులు అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. మట్టి తవ్వకాలు ముందుకు సాగకుండా దాదాపు కట్టడి చేశారు. ఇదంతా 2021లో చోటు చేసుకుంది. రామవరం వద్ద ప్రభుత్వ పోరంబోకు భూముల్లోని 107, 109 సర్వే నంబర్‌లలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్టు నిగ్గుతేల్చి సుద్దమట్టి (చైనా క్లే)గా మైనింగ్ అధికారులు నిర్ధారించుకుని సీజ్ చేశారు. 2021లో జిల్లా మైనింగ్ అధికారులు 2009 క్యూబిక్ మీటర్ల సుద్దమట్టిని జగ్గంపేట మండలం రామవరం వద్ద సీజ్ చేసి తహసీల్దార్ పర్యవేక్షణలో ఉంచారు.
ఆ రాత్రి మొత్తం ఊడ్చేశారు
టీడీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తోన్న జగ్గంపేట నియోజకవర్గం రామవరంలో రెవెన్యూ కనుసన్నల్లో ఉన్న సుద్దమట్టి మాయమైంది. సుద్దమట్టి మాయమైన గ్రామంలో టీడీపీకి అన్నీతానే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న ద్వితీయ శ్రేణి నాయకుడు చక్రం తిప్పారు. స్థానికంగా కొందరు కూటమి నేతలు పథకం ప్రకారం సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా చేసి సుమారు రు.రెండుకోట్ల విలువైన సుద్దమట్టిని రాత్రికి రాతే సరిహద్దులు దాటించేశారు. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన 2009 క్యూబిక్ మీటర్ల సుద్దమట్టి సుమారు 500 టన్నులు ఉంటుందని నాడు మైనింగ్ అధికారులు అంచనా వేశారు. ఆ రోజు రాత్రి ఏకకాలంలో 60 నుంచి 70 పది చక్రాల లారీలను వినియోగించి సుద్దమట్టిని తరలించేశారు. తెల్లారే సరికి తట్ట మట్టి కూడా లేకుండా మొత్తం ఊడ్చేశారు.
ఖరీదు కట్టిన షరాబు!
ఈ వ్యవహారంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు కూటమి నేతలకు, ఇటు అధికారులకు మధ్యవర్తిగా ఆ వ్యాపారే వ్యవహరించారంటున్నారు. టన్నుకు ధర ఇంత అన్న విషయాన్ని కూడా ఆ వ్యాపారే నిర్ణయించారంటున్నారు. మొదట రూ.2,500 అంటే పొసగని ఒప్పందం టన్నుకు రూ.4,000 వంతున అనేసరికి కుదిరిందని సమాచారం. ఈ సొమ్ములో 70 శాతం కూటమి నేతలకు, 30 శాతం పోలీసు, రెవెన్యూ శాఖలకు ముట్టజెప్పారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డివిజన్ నుంచి మండల స్థాయి వరకు పోలీసు, రెవెన్యూ శాఖలకు తలాకొంత ముట్టచెప్పడంతో ఉదాసీనంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతటి వ్యవహారం అధికార పార్టీ నేతల ప్రోద్బలం లేకుండా జరిగిందంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని స్థానికులు పేర్కొంటున్నారు. అడ్డగోలుగా సుద్దమట్టి తరలించుకుపోయి పక్షం రోజులవుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు కనిపించకపోవడం ముడుపులు మెక్కారనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
చైనా క్లే ఖనిజం గుట్ట మాయం
కూటమి నేతల పక్కా ప్లాన్
ప్రముఖ వ్యాపారి మధ్యవర్తిత్వం
టన్ను రూ.4000కు
తెగనమ్మేసిన వైనం
పక్షం రోజులైనా
పట్టించుకోని అధికారులు
ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
రామవరంలో సుద్ద మట్టి మాయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. ప్రభుత్వ సొమ్ము దోచేసినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం అన్యాయం. చడీచప్పుడు లేకుండా తరలించుకుపోయారు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసినా అధికారులు ఏమీ చేయకపోవడాన్ని ఏమనుకోవాలి. అక్రమంగా తరలించుకుపోయిన మట్టి డబ్బు.. ప్రభుత్వ ఖజానాకు కట్టించాలి.
– మేకా వీరబాబు, గ్రామ నేత, రామవరం
విచారణ జరుపుతున్నాం
రామవరంలో సీజ్ చేసిన సుద్ద మట్టి మాయం కావడంపై విచారణ చేస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలేమిటనేది రికార్డులు పరిశీలిస్తున్నాం. సుద్ద మట్టిని ఎవరు, ఎక్కడకు తరలించారనే దానిపై ఆరా తీస్తున్నాం. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– జేవీఆర్ రమేష్, తహసీల్దార్, జగ్గంపేట
Comments
Please login to add a commentAdd a comment