పన్ను కట్టకుంటే తాగునీరు బంద్
కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: పట్టణ ప్రాంతాల్లో రెడ్ నోటీస్ అందుకున్నవారు ఈ నెల 20 నాటికి పన్ను చెల్లించకపోతే ఆయా గృహాలకు ఉన్న తాగునీటి కనెక్షన్లు తొలగించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గత డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో అన్ని జిల్లాల కలెక్టర్లకు నిర్వహించిన సమీక్షలో భాగంగా సూచించిన వివిధ అంశాలపై బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, జిల్లాలోని ఇతర మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. మున్సిపల్ ప్రాంతాల్లో ఇంటింటా తడి–పొడి చెత్త సేకరణ, నూతన కుళాయి కనెక్షన్లు, లెగిసి వేస్ట్ తొలగింపు, కుక్కలకు సంతాన ఉత్పత్తిని నిరోధించే ఆపరేషన్లు, గృహాల్లో వాడిన నీరును శుద్ధి చేసే తిరిగి ఉపయోగించేందుకు అవసరమైన ప్రణాళికలు, పన్నుల సేకరణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారులకు గుంతలు పూడ్చడం వంటి అంశాలపై కలెక్టర్ కమిషనర్లతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఇంటింటా తడి–పొడి చెత్తల సేకరణ ప్రక్రియను మరింత మెరుగ్గా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎంహెచ్‌వో డాక్టర్ డి.పృథ్వీ చరణ్, ఏలేశ్వరం, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment