రత్నగిరిపై నేడు సంక్రాంతి వేడుకలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిన రత్నగిరిపై సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. భోగి పండగ సందర్భంగా సోమవారం ఉదయం 6 గంటలకు రామాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తుని తపోవనం స్వామీజీ సచ్చిదానంద సరస్వతి భోగి మంట వెలిగిస్తారని అధికారులు తెలిపారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం సంక్రాంతి విశిష్టతపై భక్తులనుద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తారు. సంక్రాంతి వేడుకలకు రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏఈఓ కె.కొండలరావు ఆధ్వర్యాన రామాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భోగి మంటకు, జానపద కళారూపాల ప్రదర్శనలకు ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం ప్రతిబంబించేలా తాటి ఆకులతో వేసిన గుడిసె, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, తాటి చెట్టు, తామర, కలువ పూలతో కూడిన కొలను, ధాన్యపు రాశి, బావి, రచ్చబండ, కోడిపుంజులు, ఎడ్లబండి, పొట్టేలు, ఆవు దూడ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు తెలుగు జానపద కళారూపాలైన గంగిరెద్దులవాళ్లు బుడబుక్కల సాయిబు, జంగమ దేవర, కొమ్మదాసరి తదితరులు కూడా సందడి చేయనున్నారని అధికారులు తెలిపారు. వీటితో పాటు సత్యదేవుని వార్షిక కల్యాణ వేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి ఆలయాన్ని, రాజగోపురాలను విద్యుద్దీపాలతో, పూలమాలలతో అలంకరిస్తున్నారు. భోగిపళ్లు వేసేందుకు గాను చిన్నారులకు ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబరాల వద్దకు తీసుకుని రావాలని అధికారులు కోరారు. దేవస్థానం ఈఓ వి.సుబ్బారావు సంక్రాంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment