రత్నగిరి భక్తుల సందడి
ఫ సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
ఫ 1,500 వ్రతాల నిర్వహణ
ఫ రూ.30 లక్షల ఆదాయం
అన్నవరం: సంక్రాంతి సెలవుల కారణంగా రత్నగిరికి భక్తుల రద్దీ పెరిగింది. సత్యదేవుడిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. స్వామివారిని 30 వేల మంది దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు, అనంతరం సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
ఘనంగా రథసేవ
ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరి కాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో మూడుసార్లు రథంపై ఊరేగించి, తిరిగి ఆలయానికి చేర్చారు.
నేడు ప్రత్యంగిర హోమం
పుష్య పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఉదయం 9 గంటల నుంచి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. పూర్ణాహుతి అనంతరం, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ఈ హోమంలో రూ.750 టికెట్టుతో భక్తులు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment