రత్నగిరిపై ప్రైవేటు కార్యక్రమం
అన్నవరం: దేవాలయాల పవిత్రతను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరో.. లేక అధికారులకు సరైన అవగాహన లేనందువల్లనో కానీ.. అటు టీటీడీ నుంచి ఇటు చిన్న ఆలయాల వరకూ కొద్ది రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సత్యదేవుని సన్నిధిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి అధికారులు అనుమతి ఇవ్వడంపై దుమారం రేగుతోంది. దేవస్థానంలోని సత్యగిరిపై పేదలు ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు గాను పెద్దాపురానికి చెందిన దాత మట్టే శ్రీనివాస్ సత్య శ్రీనివాస ఉచిత ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఇందులోని 12 మండపాల్లో ఒకే ముహూర్తానికి 12 వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. మూడేళ్లుగా ఇక్కడ వందలాదిగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వధూవరులు వివాహాలు చేసుకున్నారు. వధూవరుల వయో ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు, ఇరువైపుల పెద్దల వివరాలు, వివాహ లగ్నపత్రిక జత చేస్తే తప్ప ఇక్కడ వివాహాలు చేసుకునే అవకాశం ఉండదు. అంత కట్టుదిట్టంగా అనుమతి ఇస్తారు. అలాగే, గతంలో దేవస్థానం వార్షిక కల్యాణానికి సంబంధించిన సమావేశాలు కూడా ఇక్కడ నిర్వహించారు. నిబంధనల ప్రకారం దేవస్థానంలోని ఉచిత కల్యాణ మండపాల్లో వివాహాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరగాల్సి ఉంది. కానీ, ఈ కల్యాణ మండపంలో మంగళవారం వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి దాత అనుమతిచ్చినట్టు చెబుతున్నారు. అయితే దాతకు అవగాహన లేక అనుమతిచ్చినా.. దేవస్థానం అనుమతి నిరాకరిస్తే సరిపోయేది. కాని దేవస్థానం అధికారులు కూడా అనుమతి ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనిపై ఈఓ వీర్ల సుబ్బారావును వివరణ కోరగా.. వాసవీ కన్యకాపరమేశ్వరి ట్రస్ట్ కార్యక్రమం అనే అభిప్రాయంతో అనుమతి ఇచ్చామని, వాసవీ క్లబ్ కార్యక్రమమనే విషయం తెలియదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment