గిరిజన చట్టాలపై అవగాహన పెంచాలి
సామర్లకోట: పంచాయత్స్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ (పెసా) చట్టంపై గిరిజనులకు అవగాహన కల్పించి, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ (ఏపీఎస్‌ఐఆర్‌డీ, పీఆర్) డిప్యూటీ డైరెక్టర్ రామనాథం అన్నారు. గిరిజన చట్టాలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని అధికారులకు రెండో బ్యాచ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించారు. స్తానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆయా జిల్లాల్లోని ఎంపీడీఓలకు, ఈఓ పీఆర్‌డీలకు, నలుగురు పంచాయతీ కార్యదర్శులకు ఎంఓటీలుగా శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ పొందిన అధికారులు ఆయా మండలాల్లోని గిరిజన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు పెసా చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈటీసీ ప్రిన్సిపాల్ జె.వేణుగోపాల్ మాట్లాడుతూ, గిరిజనుల కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనకర నిబంధనలు పొందుపరిచారని చెప్పారు. గిరిజనులు ఎటువంటి శ్రమ దోపిడీకి గురవకుండా చూడాలన్నారు. వారి అభివృద్ధికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ శాఖ ద్వారా వారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఇ.కృష్ణమోహన్, ఏపీఎస్‌ఐఆర్‌డీ, పీఆర్ జాయింట్ డైరెక్టర్ శ్రీదేవి, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment