చొల్లంగి తీర్థానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి
కరప: ఉప్పలంక శివారు మొండి వద్ద ఈ నెల 29న జరిగే చొల్లంగి తీర్థానికి అన్ని ఏర్పాట్లూ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఎంపీడీఓ ఎం.అనుపమ సూచించారు. చొల్లంగి తీర్ణం నిర్వహణపై రెవెన్యూ, దేవదాయ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్షించారు. ఆ రోజు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలకు, సంగమేశ్వరస్వామి దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణతో పాటు మంచినీరు, వైద్య శిబిరం, బందోబస్తు తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. గ్రామాల నుంచి స్నానాల రేవుకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అప్పన్న ఎద్దులను తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఎస్‌ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ, భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనానికి వీవీఐపీ, వీఐపీ, సర్వదర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్నానాల రేవు వద్ద గజ ఈతగాళ్లను ఉంచుతామని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కరప ఎస్సై టి.సునీత మాట్లాడుతూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, స్నానాల రేవు వద్ద, దర్శనాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడ నుంచి యానాం వైపు వెళ్లే వాహనాలను 28వ తేదీ అర్ధరాత్రి నుంచి అన్నమ్మ ఘాటీ, తూరంగి, నడకుదురు మీదుగా గురజనాపల్లి నుంచి యానాం రోడ్డుకు వెళ్లేలా మళ్లిస్తామని వివరించారు. అలాగే, యానాం వైపు నుంచి కాకినాడ వచ్చే వాహనాలను పటవల, జి.వేమవరం, గొర్రిపూడి మీదుగా పెనుగుదురు నుంచి కాకినాడ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఎన్.సత్యనారాయణ, ఈఓ పీఆర్డీ ఎస్‌వీ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ వీవీఎస్ వర్ధన్, పీహెచ్‌సీ వైద్యులు యాంజలిన్, ట్రాఫిక్ ఎస్సై బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment