హాకీ టోర్నీకి ఏర్పాట్లు చేయండి
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో టోర్నీ సన్నాహక ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వేయి మంది క్రీడాకారులతో 40 టీములు పాల్గొంటాయన్నారు. హాకీ టర్ఫ్ చుట్టూ గ్యాలరీలు, క్రీడాకారులకు డ్రెస్ చేంజింగ్ రూంలు, లైటింగ్, క్రీడాకారులు, అంపైర్లు, క్రీడల నిర్వహణ అధికారుల బస తదితర సదుపాయాలకు రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రూ.8 కోట్లు స్పాన్సర్ చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారులను కోరారు. టోర్నమెంటు నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు జిల్లా క్రీడాప్రాథికార సంస్థ క్రీడా ప్రాంగణంలో టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించనున్న జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ఏర్పాట్లపై కలెక్టర్ షణ్మోహన్ సమీక్షించారు. ఫిబ్రవరి 7వతేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో రాష్ట్ర స్థాయి వ్యాయమ ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహణ ఏర్పాట్లను కూడా కలెక్టర్ సమీక్షించారు. డీఆర్వో జె వెంకటరావు, డీఎస్డీవో బి.శ్రీనివాసకుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జె.కాంతు, డీఈఓ పి.రమేష్, ఆర్టీవో జి.శివారెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్ డైరెక్టర్ వి.రవిరాజ్, రాష్ట్ర పీఈటీల సంఘం అధ్యక్షుడు ఎల్.జార్జి, రాష్ట్ర టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్‌కుమార్, స్పాన్సరింగ్ సంస్థలు అపోలో, మెడికవర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నివేదికలు సిద్ధం చేయండి
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు కచ్చితమైన సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ క్లస్టర్ హెడ్ మాస్టర్లు, పర్యవేక్షక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పునర్వవస్టీకరణ అంశంపై ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్ల వారీగా ప్రస్తుతం నడుస్తున్న పాఠశాలలను వాస్తవంగా హాజరవుతున్న విద్యార్థుల వివరాలను ఎంఈవోలు, క్లస్టర్ హెడ్ మాస్టర్లు క్రోడీకరించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలాల్లో ఎండీఓలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, జెడ్పీ సీఈవో వివిఎస్ లక్ష్మణరావు, ఆర్డీవోలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, హౌసింగ్ పీడీ ఎన్ సత్యనారాయణ, డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, పీవో ఎస్‌డీఏ, డీఎల్‌డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment