గుండెపోటుతో విద్యార్థిని మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని గోపాల్పేటకు చెందిన ఎరుకల శిరీష మంగళవారం గుండెపోటుతో మృతి చెందింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న శిరీష ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారినపడడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి గుండెపోటురావడంతో ఆమె మృతి చెందింది. శిరీష తండ్రి నారాయణ సెప్టెంబర్లో అనారోగ్యంతో మృతి చెందాడు. మూడు నెలల వ్యవధిలోనే తండ్రీకూతురు అనారోగ్యంబారినపడి మృతిచెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కాగా తమ ఇంటి చుట్టూ మురికినీరు పేరుకుపోవడంతోపాటు పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగి దోమలబెడద ఎక్కువగా ఉందని, అందువల్లే తమ కుటుంబంలోని ఇద్దరు అనారోగ్యానికి గురై మరణించారని నారాయణ భార్య మంజుల, పెద్ద కూతురు కవిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ఇంటి చుట్టూ పేరుకుపోయిన మురికినీటిని తొలగింపజేయడంతోపాటు పరిసరాలను శుభ్రం చేయించాలని వారు వేడుకుంటున్నారు.
● మూడునెలల వ్యవధిలో అనారోగ్యంతో తండ్రీకూతురు..
Comments
Please login to add a commentAdd a comment