నాటు కోళ్ల పెంపకానికి ప్రోత్సాహం
● మహిళా సంఘాలకు ఉపాధి
అవకాశాల కల్పన
● మండలానికో మదర్ యూనిట్
మంజూరు
● రూ. 3 లక్షల వరకు వడ్డీలేని
రుణ సాయం
● స్వయం ఉపాధి పొందుతున్న
పలువురు మహిళలు
నిజాంసాగర్: నాటు కోళ్ల పెంపకానికి ముందుకు వచ్చిన మహిళా సంఘాల సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వడ్డీ లేని రుణాలు అందిస్తూ స్వయం ఉపాధికి అండగా నిలుస్తోంది. ఐకేపీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో నాటుకోడి పిల్లల పెంపకం(మదర్ యూనిట్)ను ఏర్పాటు చేస్తోంది. మదర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రూ. 3 లక్షల వరకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో నిజాంసాగర్, జుక్కల్, లింగంపేట, కామారెడ్డి, సదాశివనగర్, దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూరు, మద్నూర్, గాంధారి, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాల్లో మదర్ యూనిట్లు ఏర్పాటయ్యాయి.
బాయిలర్ కోళ్లలాగే..
పౌల్ట్రీ ఫారాలలో బాయిలర్ కోళ్లను పెంచుతున్నట్లే నాటు కోళ్ల పెంపకం చేపడుతున్నారు. ఒక్కో ఫారంలో 500 నుంచి 2 వేల వరకు కోడి పిల్లలను పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి క్రాస్ బీడ్ నాటు కోడి పిల్లలను తీసుకువచ్చి సభ్యులకు అందిస్తున్నారు. అంతేకాకుండా కోడి పిల్లల పెంపకానికి కావాల్సిన దాణా, ఇతర సామగ్రిని సమకూర్చుతున్నారు. ఆరు వారాలపాటు పెంచిన తర్వాత కోళ్లను విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నాటు కోడి గుడ్లతో కోడి పిల్లల ఉత్పత్తి కూడా చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment