కస్తూర్బాల్లో బోధనకు బ్రేకులు
నిజాంసాగర్: జిల్లావ్యాప్తంగా ఉన్న కస్తూ ర్బా బాలికల విద్యాలయాల్లో బోధనకు బ్రేకులు పడ్డాయి. ఉద్యోగ భద్రత, పే స్కేల్ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం ఆయా పాఠశాలల్లోని సమగ్రశిక్ష పథకం కింద పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయ బృందం సమ్మెబాట పట్టడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. కస్తూర్బా పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సిలబస్ పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రశ్నార్థకంగా 5,500 మంది భవితవ్యం
జిల్లాలో 19 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా ఆరవ తరగతి నుంచి 5,500 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో ఎస్సెస్సీలో 783 మంది విద్యార్ధినులు, ఇంటర్మీడియట్‌లో 1,185 మంది విద్యార్ధినులు ఉన్నారు. కస్తూర్బా టీచర్లు నిరవధిక సమ్మె చేస్తుండటంతో ఎస్సెస్సీ, ఇంటర్మిడియట్ విద్యార్ధినులకు విద్యాబోధన చేసేవారు కరువయ్యారు. అంతేకాకుండా ఆరు నుంచి 9వ తరగతులకు సైతం టీచర్లు లేక విద్యార్థినులు తరగతి గదుల్లో కాలక్షేపం చేస్తున్నారు. మార్చి నెలలో ఇంటర్మీడియట్‌తో పాటు ఎస్సెస్సీ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎస్సెస్సీకి డిసెంబర్ నెలాఖరులోగా అన్ని సబ్జెక్టుల బోధన సిలబస్ పూర్తి కావాల్సి ఉంది. అంతేకాకుండా జనవరిలో రివిజన్ ప్రారంభం కావాల్సి ఉండగా సిలబస్ పూర్తికాక విద్యార్ధినులు ఆందోళన చెందుతున్నారు.
సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే
సిబ్బంది సమ్మెతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే బోధనేతర సిబ్బందిని కూడా సమ్మెలోకి దింపుతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటే కస్తూర్బా పాఠశాలలకు ఇక తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులతో చర్చలు నిర్వహించి వారితో సమ్మె విరమింప చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకపోతే మార్కుల పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
కొన్నిరోజులుగా సమ్మెలోనే
ఎస్‌వోలు, టీచర్లు
దగ్గరపడుతున్న ఎస్సెస్సీ,
ఇంటర్ పరీక్షలు
పాఠాలు చెప్పేవారు లేక
ఆందోళనలో విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment